కట్ట తెగి మూడేళ్లు.. ప్రవహిస్తున్న కన్నీళ్లు | - | Sakshi
Sakshi News home page

కట్ట తెగి మూడేళ్లు.. ప్రవహిస్తున్న కన్నీళ్లు

Nov 14 2026 1:05 AM | Updated on Nov 14 2026 1:05 AM

కురబలకోట : తెగిన చెరువు కట్టను మూడేళ్లుగా బాగు చేయకపోవడంతో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు పచ్చగా కళకళలాడిన పొలాలు నేడు సాగునీరు లేక పంటలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. వర్షపు నీటిని ఒడిసి పట్టాల్సిన చెరువే కన్నీటి గాథగా మిగిలింది. తమ కష్టాలు తీరేదెప్పుడు.. చెరువుకు మోక్షం లభించేదెప్పుడని రైతాంగం దీనంగా ఎదురు చూస్తోంది. కురబలకోట మండలంలోని దిగవశీతివారిపల్లె పక్కనున్న శీతివారిపల్లె చెరువు కట్ట తెగి మూడేళ్లవుతున్నా.. నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకున్న పాపానపోలేదని ఆయకట్టు రైతాంగం ఆవేదన చెందుతోంది. చెరువు కట్ట కింద భాగంలో మట్టి తీయడంతో కట్ట బలహీనపడి ఉన్న పాటున తెగిపోయినట్లు ఆయకట్టు రైతులు చెబుతున్నారు. అప్పట్లో వరదలా ప్రవాహం పోటెత్తిన విషయం తెలిసిందే. దీంతో చెరువు ఎప్పుడు బాగుపడుతుందోనని వంద ఎకరాలకు పైగా ఆయకట్టు 60 మంది రైతులు దిక్కులు చూస్తున్నారు.

అందని పరిహారం

కట్ట తెగడం వల్ల సాగులో ఉన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 30 మంది రైతుల వ్యవసాయ మోటార్లు మట్టితో మూసుకుపోయాయి. 19 మంది రైతుల పంటలు నీటిపాలైనట్లు వ్యవసాయాధికారులు ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. వారికి ఇంత వరకు పంట నష్టం పరిహారం కింద చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. అంతేకాదు సాగుభూమిపై మట్టి మేటలు పేరుకుపోయాయి. పొలాన్ని యథాస్థితికి తెచ్చుకోవడం ఎలా అని ఇప్పటికీ ఆయకట్టు రైతులు దిగులు పడుతున్నారు. చెరువు తెగి మూడేళ్లకు పైగా కావస్తున్నా ఇంత వరకు మరమ్మతు పనులను చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందని రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోందిఽ. వర్షానికి చెరువుకు నీరు చేరుతున్నా నిలవని దుస్థితి నెలకొంది. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న వారు లేరు. అధికార యంత్రాంగం ఉన్నట్టా.. లేనట్టా అని ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో ఈఈ సురేంద్రరెడ్డి యుద్ధప్రాతిపదికన పనులు చేపడతామని చెప్పినా ఇంత వరకు మొదలే పెట్టలేదు. తెగిన ఈ చెరువు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. రైతులంటే అంత చులకనగా మారారా.. అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరమ్మతులకు నోచుకోని చెరువు

వృథాగా పోతున్న వర్షం నీరు

పట్టించుకోని అధికారులు

దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement