మదనపల్లె టౌన్: మదనపల్లెలో ఆదివారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తనిఖీలలో భాగంగా మొదట మదనపల్లె జడ్పీ హైస్కూల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ తో పాటు బాలికల కళాశాల, పుంగనూరు రోడ్డు లోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటర్ కేంద్రంతో పాటు పోలింగ్ బూత్ లను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లితో కలిసి తనిఖీ చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా జరిగేలా పకడ్బందీ బందోబస్తు సుమారు వెయ్యి మందితో ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంచి ఓటర్లు ఎలాంటి భయం లేకుండా ఓటు వేసేలా అన్ని భద్రతా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ బి.ప్రసాద్, సీఐలు మోహన్ కుమార్, గోపాల్ రెడ్డి, ఎస్బీ సీఐ సదాశివయ్య తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.


