చదువుల గుడిలో చావు కేకలు! | - | Sakshi
Sakshi News home page

చదువుల గుడిలో చావు కేకలు!

Nov 1 2026 4:31 AM | Updated on Nov 1 2026 4:31 AM

● కూటమి రాజ్యంలో క్రూరులదే రాజ్యం

● రాప్తాడు రాక్షసకాండపై సర్వత్రా ఆగ్రహం

చదువుల గుడిలో లేదు రక్షణ...

పాలకులది ఉదాసీన వీక్షణం!

చదువుల తల్లి ఒడిలో నెత్తుటి మడుగులు... కూటమి రాజ్యంలో

ఆడపిల్లల గుండెల్లో చావు కేకలు..

కడప రూరల్‌ : ‘ఆడపిల్లల జోలికి వస్తే భయపడాలి‘ అంటూ మైకుల ముందు పాలకులు చెప్పే మాటలు కోటలు దాటుతుంటే, క్షేత్రస్థాయిలో ఉన్మాదుల అరాచకాలు మాత్రం బడుల గడపలు దాటి క్లాస్‌రూమ్‌లలోకి చొరబడుతున్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడు హైస్కూల్‌లో పదో తరగతి చదువుకునే బాలికపై ఎలక్ట్రిక్‌ రంపంతో జరిగిన రాక్షస దాడి, కూటమి ప్రభుత్వ చేతకానితనానికి, కుప్పకూలిన శాంతిభద్రతలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఎన్నో ఆశలతో, మరెన్నో కలలతో విద్యాసంస్థలకు వెళ్తున్న విద్యార్థినులకు చావే శరణ్యమనేలా రాష్ట్రంలో మరణ మృదంగం మోగుతుండటంతో యావత్‌ సమాజం తీవ్ర ఆగ్రహావేశాలతో ఊగిపోతోంది.

చేతగాని పాలన.. అరాచకానికి పరాకాష్ట

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌ పదేపదే శాంతిభద్రతల గురించి ఇచ్చే ఉపన్యాసాలకు, రాష్ట్రంలో రోజురోజుకూ దిగజారుతున్న పరిస్థితులకు ఎక్కడా పొంతన లేకుండా పోయింది. పాలకుల అసమర్థత వల్లే నిందితులకు చట్టాలన్నా, పోలీసులన్నా కనీస భయం లేకుండా పోయింది. ధర్మవరం మండలానికి చెందిన హేమంత్‌ అనే రాక్షసుడు ఏకంగా ప్రభుత్వ బడిలోకి, అదీ క్లాస్‌ రూమ్‌లోకి ఆయుధంతో వచ్చి దాడి చేస్తుంటే అడ్డుకునే నాథుడే కరువయ్యాడు. ఈ దారుణ దాడిలో సదరు బాలిక రక్తపు మడుగులో కుప్పకూలడమే కాకుండా, తోటి విద్యార్థినులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.

విద్యాసంస్థల్లో మరణ మృదంగం

కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థినులపై వేధింపులు, దాడులు నిత్యకృత్యంగా మారాయి. ఎంతోమంది ఆడపిల్లలు బలవన్మరణాలకు గురవుతుంటే, మరికొందరు ఇలాంటి ఉన్మాదుల చేతిలో బలైపోతున్నారు. రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలు చేతులెత్తేయడంతో, రాష్ట్రంలో క్రూరుల రాజ్యం నడుస్తోందన్న వానద బలంగా వినిపిస్తోంది. బడికి పంపే ఆడపిల్లలు క్షేమంగా తిరిగి ఇంటికి వస్తారా లేదా అన్న భయాందోళనల్లో తల్లిదండ్రులు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వ చేతకానితనాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement