ఎన్నికల్లో అరాచక శక్తులను ఓడించండి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో అరాచక శక్తులను ఓడించండి

Oct 30 2026 1:21 AM | Updated on Oct 30 2026 1:21 AM

సాక్షి, మదనపల్లె : మదనపల్లె మున్సిపల్‌ ఎన్నికల్లో అరాచక శక్తులను ఓడించాలని వైఎస్‌ఆర్సీపీ లోక్‌సభ పక్షనేత, రాజంపేట పార్లమెంట్‌ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్‌ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ శక్తులను ఓడించకుంటే మున్సిపల్‌ కార్యాలయానికి స్వేచ్ఛగా వెళ్లి ఏ పని చేసుకోలేని పరిస్థితి వస్తుందని, దీన్ని ప్రతి ఓటరూ గమనించి టీడీపీని ఓడించాలని కోరారు. గురువారం ఆయన మదనపల్లె నీరుగట్టువారిపల్లెలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల విజయానికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మదనపల్లె మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజల్లో భయాందోళనలు సృష్టించి, వారిని ఓటింగ్‌కు రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అడ్డదారుల్లో గెలవాలని అభ్యర్థులను కూడా లక్ష్యంగా చేసుకొని టీడీపీ వాళ్లు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. మదనపల్లెలో ప్రశాంతత ఉండాలంటే, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రతి ఒక్కరికీ గౌరవం లభిస్తుందన్నారు. టీడీపీ పాలనలో పరిస్థితులు ఎలా ఉంటాయో నీరుగట్టువారిపల్లెలో చేనేత కార్మికుల దుస్థితి అందుకు నిదర్శనమని అన్నారు. జగనన్న పాలనలో పది వేల మంది కార్మికులకు నేతన్న నేస్తం పథకం అందిస్తే, చంద్రబాబు ప్రభుత్వం రెండు వేల మందికి మాత్రమే ఇచ్చారు, ఇది కూడా లంచాలు తీసుకొని లేదా పథకం సొమ్ములో నీకు సగం నాకు సగం అని దోచుకున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి గట్టిగా బుద్ధి చెబితే అందుకు మేము అండగా ఉంటాం, నేతన్న సేవలో పథకం ద్వారా అందరికీ న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని అన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో ప్రతి ఒక్కరూ ధైర్యంగా వెళ్లి వారి పనులు చేసుకునేలా మేము అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు.

ఎన్నికల ప్రక్రియ ఘోరం

రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ఘోరాతి ఘోరంగా ఉందని మిథున్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ నుంచి ఓటింగ్‌ జరిగే వరకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలుగా భయభ్రాంతులకు గురి చేస్తోందని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని కోరుతున్నామన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థలు, పోలీసులు నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ జరపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

వైఎస్సార్‌సీపీతోనే అభివృద్ధి సాధ్యం

పుంగనూరు : తెలుగుదేశం ప్రభుత్వం ప్రజావ్యతిరేక, అరాచక పాలనకు గుణపాఠం నేర్పాలని, వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమౌతుందని వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన మండలంలోని చండ్రమాకులపల్లె గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల కరపత్రాలను పంపిణీ చేసి, ఫ్యాన్‌ గుర్తుపై ఓట్లు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ శాంతియుతంగా ఉన్న పుంగనూరులో తెలుగుదేశం ప్రభుత్వం అరాచకాలతో, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి విధ్వంసాలు సృష్టించే వారికి ఓట్లు వేస్తే సమస్యలు తీవ్రమవుతాయన్నారు. ఇలాంటి వారికి ఓటుతో గుణపాఠం నేర్పి, టీడీపీ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనాథరెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి వెంకటరమణ, నాయకులు నారాయణస్వామి, హేమారెడ్డి పాల్గొన్నారు.

దౌర్జన్యాలకు బెదిరేది లేదు

సోమల(సదుం) : కూటమి దౌర్జన్యాలకు బెదిరేది లేదని, ప్రజా సమస్యలపై తమ పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని వైఎస్సార్‌ సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. సోమల మండలం నెల్లిమంద పంచాయతీలో గురువారం ఆయన పర్యటించారు. ఇటీవల చింతలవారిపల్లెలో టీడీపీ నాయకులు దాడి చేయడంతో ధ్వంసం అయిన ఎంపీటీసీ అభ్యర్థి మనీలా గృహాన్ని ఆయన పరిశీలించారు. జెడ్పీటీసీ అభ్యర్థి సాంబశివయ్య, పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. టీడీపీ నాయకులు దౌర్జన్యాలు, అక్రమ కేసులతో ఎన్నికలను ఏకగ్రీవం చేసుకుని, దానిని తమ గొప్పదనంగా చాటుకోవడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు పోటీ ఉన్న చోట భారీ విజయం సాధించేలా ప్రజలు చొరవ చూపాలని, అప్పటికై నా కూటమి నేతలలో మార్పు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. దాడులు, అక్రమ కేసు బాధితులు భయపడాల్సిన పనిలేదని తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఓటర్లు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదని, నిర్భయంగా వైఎస్సార్‌ సీపీకి ఎన్నికలలో మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గంగాధర్‌ రాయల్‌, మోహన్‌, నాగేశ్వరరావు, వెంకటరమణ, ప్రభాకర, ఈశ్వరయ్య, సీఎల్‌పీ రెడ్డి, బాబూరావు, సయ్యద్‌బాషా, శ్రీరాములు, వసంతమ్మ, పుష్పావతి తదితరులు పాల్గొన్నారు.

చేనేత అక్రమాలపై ఓటుతో టీడీపీకి బుద్ధి చెప్పండి

రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ఘోరం

నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పోలీసులు సహకరించాలి

మదనపల్లెలో ఎంపీ మిథున్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement