పులివెందుల : మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల పర్యటన ముగిసింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు మంగళవారం ఉదయం పులివెందులలోని వైఎస్సార్ ఆడిటోరియంలో పులివెందుల నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరాచకాలను తూర్పారబట్టారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. టీడీపీ నేతలకు ఆయన విసిరిన సవాల్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపింది.
పార్టీ కార్యకర్తకు భరోసా
బుధవారం ఉదయం పులివెందుల నుంచి బెంగుళూరుకు బయలుదేరుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పులివెందుల పట్టణం నగరిగుట్టకు చెందిన గండికోట పవన్‌కుమార్ కలిశారు. ఈనెల 17న పులివెందుల మున్సిపల్ ఎన్నికల నామినేషన్ సందర్భంగా పోలీసులు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై జరిపిన లాఠీఛార్జి, భాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లు, ఏకే 47 కాల్పులలో పవన్‌కుమార్ కాలికి తీవ్ర గాయమైంది. ఈ నేపథ్యంలో పవన్‌కుమార్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తనకు తగిలిన గాయం గురించి వైఎస్ జగన్‌కు వివరించారు. స్పందించిన ఆయన ధైర్యంగా ఉండాలని ఎలాంటి ఆందోళన చెందవద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హెలీప్యాడ్ వద్ద వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పులివెందుల మున్సిపల్ ఇన్‌చార్జి చవ్వా దుష్యంత్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, రైతు విభాగం నాయకుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, వేల్పుల రామలింగారెడ్డి, తదితరులతోపాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు వీడ్కోలు పలికారు.


