నిర్లక్ష్యానికి నిదర్శనం: వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో మదనపల్లె ప్రజల కోసం మెడికల్ కళాశాల నిర్మాణం చేపట్టారు. కూటమి నిర్లక్ష్యంతో ఇదిగో ఇలా ఆగిపోయింది.
సాక్షి, మదనపల్లె: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎంపీ మిథున్‌రెడ్డి కృషితో సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం (శానిటోరియం) వద్ద 95.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.475 కోట్ల వ్యయంతో మెడికల్ కళాశాల నిర్మాణం చేపట్టారు. మదనపల్లెలోని నిరుపేదలకు కార్పోరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించి తీసుకొన్న గొప్ప నిర్ణయం ఇది. చంద్రబాబు రాగానే వీటి పనులను నిలిపివేయించారు. పనులు సవ్యంగా సాగివుంటే 2025 ఆగష్టు నాటికి పనులు పూర్తి చేయాలన్నది జగనన్న లక్ష్యం. చంద్రబాబు అడ్డుకోవడంతో పనులు ఆగిపోయి, జిల్లా ఆస్పత్రిలో 80 మంది వైద్యులతో అందుతున్న వైద్యసేవలను 17 మంది వైద్యులకు కుదించడంతో మెరుగైన వైద్యం అందడంలేదు.
● మదనపల్లె బీటీ కళాశాలను విశ్వవిద్యాలయంగా చేసేందుకు ఎంపీ మిథున్‌రెడ్డి తీవ్రకృషి ఫలితంగా జగనన్న పాలనలో ఉత్తర్వులు వచ్చాయి. కొట్లతో అభివృద్ధి పనులు చేశారు. చంద్రబాబు రాగానే ఈ కళాశాలపై కక్షకట్టి విశ్వవిద్యాలయ జీవోను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉన్నత విద్యకోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు.
● మదనపల్లెకు కేంద్రీయ విద్యాలయం కోసం ఎంపీ మిథున్‌రెడ్డి కేంద్రంతో ఒప్పించి మంజూరు చేయించగా చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభానికి ఆసక్తి చూపలేదు. ఎంపీ నిధులు రూ.40 లక్షలను మిథున్‌రెడ్డి మంజూరు చేయగా పనులు చేసి హాస్టల్ భవనంలో ప్రారంభించారు. ఇప్పుడు వలసపల్లె వద్ద కేటాయించిన 6.09 ఎకరాల్లో భవనాల నిర్మాణం కోసం రెవెన్యూ పరమైన సమస్యను పరిష్కరించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. దీనితో నిధులు మంజూరైనా భవన నిర్మాణాలు మొదలుకాలేదు.


