మదనపల్లె టౌన్: కడప డిప్యూటీ కమిషనర్ జయరాజ్ సాగర్ అధ్యక్షతన బుధవారం ఎకై ్సజ్ శాఖ అంతర్‌రాష్ట్ర సమన్వయ సమావేశం జరిగింది. సమావేశంలో కడప ఏసీ చంద్రశేఖర్ రెడ్డి, ఈఎస్ ఆర్. మధుసూదన్ రావు, కర్ణాటక చిక్ బళ్లాపూర్ డిప్యూటీ సూపరింటెండెంట్, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, మదనపల్లె సీఐ భీమలింగ, మొలకలచెరువు, ఈఎస్టీఎఫ్ సీఐలు పాల్గొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక సరిహద్దు నుండి అక్రమ మద్యం రాకుండా చెక్ పోస్టుల వద్ద కట్టుదిట్టమైన నిఘా పెంచాలని నిర్ణయించారు. మద్యం దుకాణాల్లో పరిమితికి మించి విక్రయించవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఈవీఎం గోదాము తనిఖీ
రాయచోటి : అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తనిఖీలో భాగంగా.... రాయచోటి పట్టణం మార్కెట్ యార్డ్ లో ఉన్న ఈవీఎం గోదామును బుధవారం రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్‌లో అంతర్భాగాలను రాజకీయ పార్టీల సమక్షంలో గోదాము లోపల భద్రపరిచిన ఆయా ఈవీఎం యంత్రాలు బీయూలు, సీయూలు, వీవీ ప్యాట్ లను, అక్కడి భద్రతా చర్యలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలన చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ యామిని, కలెక్టరేట్ ఎలక్షన్ సెక్షన్ సూపరింటెండెంట్ రాణా ప్రతాప్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ
కలికిరి: కలికిరి కేవీకే కార్యాలయంలో ఈ నెల 30, 31 తేదీల్లో పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామని కేవీకే కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.మంజుల తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, గ్రామీణ, పట్టణ ప్రాంత యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. తక్కువ స్థలంలో తక్కువ పెట్టుబడితో పుట్టగొడుగుల సాగు విధానం, బెడ్ తయారీ, పురుగులు, తెగుళ్ల నియంత్రణ, విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెటింగ్ సదుపాయాలు తదితర అంశాలపై శిక్షణ ఇస్తామని, మరిన్ని వివరాలకు 80085 00320 నంబరును సంప్రదించాలని సూచించారు.


