మదనపల్లి (కురబలకోట): ముఖ్యమంత్రి చంద్రబాబు మదనపల్లి పర్యటన నేపధ్యంలో ఉద్యమకారుల, సోషల్ మీడియా ఖాతాలు, మొబైల్‌ను బ్లాక్ చేయడం ద్వారా భావ ప్రకటన స్వేచ్చను హరిస్తున్నారని భారతీయ అంబేద్కర్ సేన (బాస్) జాతీయ కన్వీనర్ పీటీఎం శివప్రసాద్ ఆరోపించారు. బుద్దుని కొండ ఘటనపై నిరసన తెలిపిన బౌద్ధులపై కేసులు నమోదు చేయడం, బుద్ధ విహార్‌పై ఆంక్షలు విధించడం, బుద్ధుని విగ్రహం చుట్టూ కంచె ఏర్పాటు చేసి నెలల తరబడి రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆయన విమర్శించారు. సీఎం దృష్టికి సమస్యలను తీసుకెళ్లేందుకు గాంధీ జయంతి రోజున చలో మదనపల్లి కార్యక్రమానికి అనుమతి నిరాకరించడంతో పాటు సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయడం విడ్డూరమే కాకుండా అప్రజాస్వామిక చర్య అని ఆయన విమర్శించారు.
హార్టికల్చర్ హబ్‌లో
ప్రైవేటు పెత్తనమెందుకు?
మదనపల్లి (కురబలకోట): కరువు ప్రాంతమైన రాయలసీమ ప్రాంతానికి మదనపల్లి కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న హార్టికల్చర్ హబ్‌లో ప్రైవేటు పెత్తనమెందుకుని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు ప్రశ్నించారు. గురువారం ఆయన మదనపల్లి సీపీఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ హార్టికల్చర్ హబ్ రైతుల ప్రయోజనాలకు కేంద్రంగా ఉండాలే తప్ప కార్పొరేట్ సంస్థల వ్యాపార కేంద్రంగా ఉండకూడదన్నారు. లక్ష కోట్లతో పెట్టుబడుల ప్రణాళిక ఉండగా రూ.40 వేల కోట్లు ప్రభుత్వ పెట్టుబడులు, మరో రూ.60 వేల కోట్లు ప్రైవేటు పెట్టుబడులుగా ప్రతిపాదించినట్లు వార్తలు రావడంపై మండిపడ్డారు. రైతు పండిస్తాడు..అవి కార్పొరేట్‌కు వెళ్లి వారు లాభపడతారు..ప్రభుత్వ పెట్టుబడి పెడుతుంది..ఇదేనా అభివృద్ధి అని ప్రశ్నించారు. ప్రశ్ని రైతులకు మద్దతు ధర లభించేలా, నిల్వ సదుపాయాలు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతి అవకాశాలు, స్థానిక యువతకు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే హార్టికల్చర్ హబ్‌ను నిర్వహించాలని డిమాండ్ చేశారు.
నేడు సీఎం, కేంద్ర మంత్రి రాక
సాక్షి, మదనపల్లె: మదనపల్లెలో ఏర్పాటు చేసిన రాయలసీమ హార్టికల్చర్ హాబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమానికి శుక్రవారం సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేష్ హాజరుకానున్నారు. అలాగే బీకేపల్లెలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. వీరి రాక కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మదనపల్లె మండలంలోని కొండామర్రిపల్లె సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ , సభా వేదికను మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు.
సీఎం పర్యటనకు భారీ బందోబస్తు:
ఎస్పీ ధీరజ్
మదనపల్లె టౌన్: ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో 2500 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుగులి గురువారం తెలిపారు. హెలీపాడ్, సభా ప్రాంగణం, వీఐపీ గ్యాలరీ, పార్కింగ్ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్‌కు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామని ఎస్పీ వెల్లడించారు.


