మిట్స్‌ ఆధ్వర్యంలో 50 జీఐ ట్యాగ్‌ దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

మిట్స్‌ ఆధ్వర్యంలో 50 జీఐ ట్యాగ్‌ దరఖాస్తులు

Oct 2 2026 1:28 AM | Updated on Oct 2 2026 1:28 AM

కురబలకోట : అంగళ్లులోని మిట్స్‌ యూనివర్సిటీలోని మిట్స్‌ ఇంటిలెక్చువల్‌ ప్రాపర్టీ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ (మిట్స్‌–ఐపీఎఫ్‌సీ) ఆధ్వర్వంలో 50 భౌగోళిక సూచి (జీఐ) ట్యాగ్‌ల కోసం దరఖాస్తులు దాఖలు చేసినట్లు యూనివర్సిటీ ఫౌండర్‌, చాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎన్‌.విజయభాస్కర్‌ చౌదరి గురువారం తెలిపారు. వీటిలో 37 దరఖాస్తులు అనంతపురం, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్‌ కడప, తిరుపతి జిల్లాలకు చెందిన వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు సంబంధించినవన్నారు. మదనపల్లి టమాటా, చింతపండు, నేరేడు, అరటి, చిత్తూరు సపోటా, తోతాపురి, దానిమ్మ, నీలం, బాదం, ఉలవలు, రాగి, పింక్‌ జామ తదితర ఉత్పత్తులు ఇందులో ఉన్నాయని తెలిపారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు హార్టికల్చర్‌ హబ్‌ నేపథ్యంలో ఈ దరఖాస్తులకు ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. ప్రాంతీయ ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు, నాణ్యత, ప్రతిష్టను పరిరక్షించడమే లక్ష్యమన్నారు. ఈ ప్రక్రియలో సహకరించిన రైతు సంఘాలు, ప్రొడ్యూసర్‌ కంపెనీలు, సొసైటీలతోపాటు డాక్టర్‌ తులసీరామ్‌ నాయుడు, డాక్టర్‌ పి. శివయ్య కృషిని అభినందించారు. మేధో సంపత్తి హక్కుల ద్వారా చట్టబద్ధమైన గుర్తింపు తీసుకు రావడంలో మిట్స్‌ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.

కోడి పందేలు.. 8 మంది అరెస్ట్‌

రొంపిచెర్ల : కోడి పందెం ఆడుతున్న వారిపై దాడి చేసి 8 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.7700 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ మధుసూధన్‌ తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పెద్దగొట్టిగల్లు గ్రామ పంచాయతీలోని రామిరెడ్డిగారిపల్లె సమీపంలో కోడి పందెం ఆడుతున్నారని గురువారం సాయంత్రం అందిన రహస్య సమాచారం మేరకు దాడి చేయగా 8 మంది నిందితులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.7700 నగదు, రెండు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలియజేశారు.

భూ తగాదాతో ఘర్షణ

మదనపల్లె టౌన్‌ : తంబళ్లపల్లె మండలం కోటకొండ పంచాయతీ నాయునివారిపల్లెకు చెందిన జీతానంద్‌(35) ఇంటి ముందు గురువారం ఆనంద్‌, అతని సోదరుడు రాతి స్తంభాలు నాటుతుండగా పక్కింటి నరసింహులునాయుడు అడ్డుకున్నాడు. ఆ స్థలంలో తనకూ వాటా ఉందంటూ గొడవకు దిగడంతో వాగ్వాదం ఘర్షణగా మారింది. నరసింహులు, అతని కుటుంబీకులు కలిసి ఆనంద్‌పై రాళ్లతో దాడి చేశారని ఆరోపించారు. గాయపడిన ఆనంద్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

దివ్యాంగుల క్రికెట్‌లో కెప్టెన్‌గా జిల్లా వాసి

లక్కిరెడ్డిపల్లి : అనంతపురంలో గత నెల 28న జరిగిన సౌత్‌ జోన్‌ దివ్యాంగుల క్రికెట్‌ టోర్నమెంట్‌ పోటీలలో కడప, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సంబంధించిన దివ్యాంగుల క్రీడాకారులు పాల్గొన్నారు. లక్కిరెడ్డిపల్లి మండలం కోనంపేటకు చెందిన కె సుబ్బయ్య కెప్టెన్‌గా నిలిచి ఆల్‌రౌండర్‌ ప్రతిభను కనబరిచి, జట్టు విజయం సాధించడంతో కీలక పాత్ర పోషించినట్లు జిల్లా దివ్యాంగుల క్రికెట్‌ జోనల్‌ సెక్రటరీ మనోహర్‌ రాజు తెలిపారు. మరలా రాష్ట్రస్థాయి ఈస్ట్‌ జోన్‌ క్రీడల్లో వీరు పాల్గొంటారని ఆయన తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement