ఈదురు గాలులకు నేలకొరిగిన ఉద్యాన పంటలు | - | Sakshi
Sakshi News home page

ఈదురు గాలులకు నేలకొరిగిన ఉద్యాన పంటలు

Oct 2 2026 1:28 AM | Updated on Oct 2 2026 1:28 AM

వేంపల్లె : అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వీచిన ఈదురుగాలులతో ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేంపల్లె మండలంలోని కుప్పాలపల్లె, తాళ్లపల్లె, టి.వెలమవారిపల్లె, గిడ్డంగివారిపల్లె, బక్కన్నగారిపల్లె, నందిపల్లె, కత్తులూరు తదితర గ్రామాల్లో సాగు చేసిన 190 రైతులకు చెందిన అరటి పంట దాదాపు 400 ఎకరాల్లో నేలమట్టమయ్యింది. బుధవారం రాత్రి వీచిన బలమైన ఈదురు గాలుల ధాటికి పూర్తిగా అరటి తోటలు నేలమట్టం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 400 ఎకరాల్లో అరటి పంట నష్టం జరగడంతో రూ.6 కోట్ల నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోతున్నారు. నందిపల్లె గ్రామానికి చెందిన మారం రామాంజనేయరెడ్డి, మారం శివ ప్రసాద్‌రెడ్డి, బంక వేణుగోపాల్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, కుప్పాలపల్లెకు చెందిన చాపటి రామిరెడ్డి, టి.వెలమవారిపల్లెకు చెందిన చవ్వా రవిశంకర్‌రెడ్డి, శనివారపు గోపాల్‌ రెడ్డి, అండ్లూరు రామాంజనేయరెడ్డిలతోపాటు పలువురి రైతులకు చెందిన అరటి పంట నష్టం జరిగింది. చేతికొచ్చే సమయంలో పంట నేలకొరగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అరటి సాగుకు ఎకరాకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడి కింద ఖర్చు చేసినట్లు రైతులు తెలిపారు. పంట సాగు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు, నీటి పారుదల తదితర వాటిపై భారీగా పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించి, వచ్చే సాగుకు ఆర్థికంగా అండగా నిలవాలని వారు కోరుతున్నారు. టి.వెలమవారిపల్లెలో 45 మంది రైతులకు చెందిన అరటి పంట 40 హెక్టార్లు, తాళ్లపల్లెలో 135 మంది రైతులకు చెందిన అరటి పంట 115 హెక్టార్లు, కత్తులూరులో 10 మంది రైతులకు చెందిన 5 హెక్టార్లలో అరటి పంట దెబ్బతిందని ఉద్యానవన శాఖ అధికారి రాఘవేంద్రారెడ్డి తెలిపారు.

దెబ్బతిన్న బొప్పాయి

తాళ్లపల్లె, బకన్నగారిపల్లె, టి.వెలమవారిపల్లె ప్రాంతాల్లో నిమ్మ చెట్లు నేలకొరిగినట్లు రైతులు వాపోతున్నారు. తాళ్లపల్లె గ్రామానికి చెందిన అల్తాఫ్‌, రఫి, గంగరాజు, షరీఫ్‌, పవన్‌, నారాయణరెడ్డి, నాగముని, శేఖర్‌ అనే రైతులకు సంబంధించి దాదాపు 200 నిమ్మ చెట్లు పడిపోయినట్లు తెలిసింది. బొప్పాయి కూడా అక్కడక్కడా దెబ్బతిన్నట్లు ఉద్యానవనాధికారి రాఘవేంద్రరెడ్డి తెలిపారు. పంటలను పరిశీలించి పూర్తి నివేదికను జిల్లా ఉన్నతాధికారుల పంపించి రైతులకు ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందేలాగా చూస్తామని ఆయన పేర్కొన్నారు.

అరటి, నిమ్మ తోటల్లో భారీగా నష్టం

లబోదిబోమంటున్న రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement