సాక్షి, మదనపల్లె : మదనపల్లెలో కూటమి పార్టీలకు చెందిన నాయకుల అవినీతి, భూకబ్జాలు మితిమీరి సాగుతున్నాయని, దీనిపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలకు సిద్ధం అవుతామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఇక్కడికి వస్తున్న సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండగా మంత్రి లోకేష్ వైఎస్సార్‌సీపీ నాయకుల అవినీతి, భూకబ్జాలంటూ ఆరోపణలు చేశారని, ఇప్పుడు మదనపల్లెలో కూటమినేతలే ఈ వ్యవహారాలన్నీ నడుపుతున్నారని, కొందరు నాయకులు భూకబ్జాలు రుజువయ్యాయని, చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. హంద్రీ–నీవా ద్వారా చెరువులకు నీళ్లు ఇవ్వాలని, బీటీ కళాశాలను విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఉన్నత చదువుల కోసం విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. టమాట సాగకు కేంద్రమైన మదనపల్లెలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరారు. మదనపల్లె మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. అన్నమయ్యను మదనపల్లె జిల్లాగా పేరు పెట్టాలని కోరారు. మదనపల్లి పట్టణ ప్రజలకు 20 రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా అవుతోందని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.
చంద్రబాబు చర్యలు తీసుకోవాలి
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌కుమార్


