సీఐ పాత్రపైనా సస్పెన్స్‌ | - | Sakshi
Sakshi News home page

సీఐ పాత్రపైనా సస్పెన్స్‌

Oct 1 2026 12:35 AM | Updated on Oct 1 2026 12:35 AM

●డైరీ దొరకడం నిజమే..

●డైరీ దొరకడం నిజమే..

● ములకలచెరువు నకిలీ మద్యం గుట్టు రట్టయి ఏడాది..

● రెండు మధ్యంతర చార్జ్‌షీట్లు

వెనక్కి.. త్వరలో పూర్తిస్థాయి

తుది అభియోగపత్రం

● దర్యాప్తు అధికారి వెల్లడి..పసుపు నేతల గుండెల్లో గుబులు

సాక్షి, మదనపల్లె: అది కేవలం ఒక నకిలీ మద్యం తయారీ కేంద్రం కాదు.. మూడు రాష్ట్రాల సరిహద్దులు దాటి విస్తరించిన ఒక భారీ ‘మరణ మాఫియా’! గత అక్టోబర్‌ 3న అన్నమయ్య జిల్లా ములకలచెరువు సమీపంలోని ఒక గోదాముపై ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం మెరుపు దాడి చేసినప్పుడు ఈ ఘోర దందా వెలుగుచూసింది. తాజాగా ఈ కేసులో చేర్చిన మొత్తం 33 మంది నిందితుల కస్టడీ, విచారణ పర్వం ముగిసి.. కోర్టులో తుది అభియోగపత్రం దాఖలు చేసే కీలక ఘట్టానికి దర్యాప్తు చేరుకుంది. అయినప్పటికీ, దాడుల సమయంలో దొరికిన ఆ ‘సీక్రెట్‌ డైరీ’ చుట్టూ సాగుతున్న సస్పెన్స్‌, సస్పెండైన సీఐ పాత్రపై రహస్యం ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి.

రెండు మధ్యంతర చార్జ్‌షీట్లు వెనక్కి.. పూర్తిస్థాయిలో తుది పత్రం

నకిలీ మద్యం తయారీకి సంబంధించి తంబళ్లపల్లె కోర్టులో దర్యాప్తు అధికారి ఈ ఏడాది కాలంలో ఇప్పటికే రెండు మధ్యంతర అభియోగపత్రాలను దాఖలు చేశారు. అయితే ఆ రెండు చార్జ్‌షీట్లు దాఖలు చేసే నాటికి ఈ కేసులో అత్యంత కీలక నిందితులుగా ఉన్న టీడీపీ నేత జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్‌ రెడ్డిలు ఇంకా అరెస్ట్‌ కాలేదు. ఇటీవల వారిద్దరి బెయిల్‌ పిటిషన్లను సుప్రీంకోర్టు సైతం కొట్టేయడంతో వారు మదనపల్లె కోర్టులో లొంగిపోయి జైలుకు వెళ్లారు. ఆ తర్వాత వారిని మూడు రోజుల పాటు ఎకై ్సజ్‌ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ప్రధాన ముద్దాయిల విచారణ కూడా ముగియడంతో.. ఈ కేసులో సేకరించిన సాంకేతిక ఆధారాలు, నిందితుల వాంగ్మూలాలు, కస్టడీ సమయంలో వారు బహిర్గతం చేసిన దిగ్భ్రాంతికర అంశాలన్నింటినీ కలుపుతూ సమగ్రమైన చార్జ్‌షీట్‌ వేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే కోర్టులో దాఖలు చేసిన రెండు మధ్యంతర అభియోగపత్రాలను వెనక్కి తీసుకుని, త్వరలోనే నిందితులందరిపై పూర్తిస్థాయిలో తుది అభియోగపత్రాన్ని దాఖలు చేయనున్నట్లు దర్యాప్తు అధికారి ఏఈఎస్‌ జోగేంద్ర స్పష్టం చేశారు.

అధికారం అండతో..

డిస్టిలరీ తరహాలో దందా

ఈ నకిలీ మద్యం తయారీ వ్యవహారమంతా టీడీపీ నేతల అండదండలతోనే సాగిందన్న పచ్చి నిజం ఎకై ్సజ్‌ దర్యాప్తులో పూర్తిగా బహిర్గతమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్‌ రెడ్డిలు ఈ కేసులో కీలక నిందితులుగా మారారు. పాలకుల అధికారం అండగా చూసుకుని, ఏకంగా ఓ డిస్టిలరీ తరహాలోనే నకిలీ మద్యం తయారీకి తెగబడి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ జరిపిన మెరుపు దాడుల్లో నకిలీ మద్యం తయారీకి ఉపయోగించే 3 అత్యాధునిక యంత్రాలు, బ్లెండర్‌ యంత్రాలు, 180 ఎంఎల్‌ సామర్థ్యం గల 10,000 ఖాళీ బాటిళ్లు, 78 క్యాన్ల స్పిరిట్‌/కెమికల్స్‌తో పాటు, సరఫరాకు సిద్ధంగా ఉంచిన 15,024 బాటిళ్లను ఎకై ్సజ్‌ బలగాలు సీజ్‌ చేశాయి. ఈ కల్తీ మద్యాన్ని అడ్మిరల్‌ బ్రాందీ, బెంగళూరు బ్రాందీ, కేరళ మాల్ట్‌ విస్కీ, రాయల్‌ లాన్సర్‌, సుమో తదితర 7 రకాల నకిలీ బ్రాండ్ల లేబుళ్లతో మార్కెట్లో చెలామణి చేస్తున్నట్టు గుర్తించారు.

నకిలీ మద్యం నింపిన బాటిళ్లు (ఫైల్‌)

నకిలీ మద్యం తయారీ యంత్రం (ఫైల్‌)

ఈ నకిలీ మద్యం నెట్‌వర్క్‌కు గుండెకాయ లాంటి ఆ ‘సీక్రెట్‌ లంచాల డైరీ’ లభ్యమైందని దర్యాప్తు అధికారి జోగేంద్ర ఇదివరకే ధ్రువీకరించారు. ఎవరెవరికి ఎంతెంత వాటాలు (ముడుపులు) వెళ్లాయనే పక్కా రికార్డులు ఆ డైరీలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, అక్రమార్కులకు కొమ్ముకాస్తూ, నకిలీ మద్యం మాఫియాకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ములకలచెరువు ఎకై ్సజ్‌ సీఐ హిమబిందు సస్పెన్షన్‌ వేటు నిరంతరాయంగా కొనసాగుతోంది. ఆమెకు సంబంధించిన సాంకేతిక ఆధారాలను కూడా అధికారులు నిశితంగా పరిశీలించారు. ఈ డైరీని, సీఐ కాల్‌ డేటాను మరియు కస్టడీ నిందితుల వాంగ్మూలాలను బేస్‌ చేసుకుని కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలైతే ఎంతటి పెద్దల పేర్లు బయటకు వస్తాయోనని సంబంధితులు అందరిలో గుబులు రేపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement