అన్నమయ్య జిల్లా మొత్తం కొత్త దరఖాస్తులు : 39,495 (అధికారిక రికార్డుల ప్రకారం) ప్రస్తుత స్థితి : గడువు ముంచుకొచ్చినా అధికారులకు అందని జీవోలు, గైడ్‌లైన్స్‌ కూటమి మార్క్‌ సాకు: క్షేత్రస్థాయి వెరిఫికేషన్‌ పూర్తయినా పోర్టల్‌ పూర్తి క్లోజ్‌ తెరవెనుక అసలు కారణం: | - | Sakshi
Sakshi News home page

అన్నమయ్య జిల్లా మొత్తం కొత్త దరఖాస్తులు : 39,495 (అధికారిక రికార్డుల ప్రకారం) ప్రస్తుత స్థితి : గడువు ముంచుకొచ్చినా అధికారులకు అందని జీవోలు, గైడ్‌లైన్స్‌ కూటమి మార్క్‌ సాకు: క్షేత్రస్థాయి వెరిఫికేషన్‌ పూర్తయినా పోర్టల్‌ పూర్తి క్లోజ్‌ తెరవెనుక అసలు కారణం:

Oct 1 2026 12:35 AM | Updated on Oct 1 2026 12:35 AM

● అక్టోబరు 1 వచ్చినా కొత్త

పింఛన్లపై రాని ప్రభుత్వ ఆదేశాలు

● జనంలో అసంతృప్తి చల్లార్చడానికే ‘కూటమి’ ఆర్భాటం

● తీరా చూస్తే అధికారులకు

సమాచారమే లేదు

● జిల్లాలో 39,495 మంది

నిరుపేదల ఆశలపై నీళ్లు

● ఎన్నికల స్టంట్‌లో భాగంగా ఎంపీ డీఓలు, కమిషనర్ల వడపోత జాతర

మదనపల్లె (కురబలకోట): ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న కాలయాపన విధానం ఇప్పుడు నిరుపేదలు, వృద్ధులు, వితంతువుల పాలిట శాపంగా మారింది. అక్టోబరు ఒకటో తేదీ నుంచి కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన పాలకులు.. తీరా గడువు ముగిసినా నేటికీ ఆ ఊసే ఎత్తడం లేదు. కనీసం అధికారులకు ఎలాంటి గైడ్‌లైన్స్‌ కూడా జారీ చేయకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో, దరఖాస్తు చేసుకున్న వేలాది మంది నిరుపేదలకు నేడు అసలు పింఛన్‌ అందుతుందా? లేదా కూటమి ప్రభుత్వం మళ్లీ మొండిచేయి చూపుతుందా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు.

అసంతృప్తి చల్లార్చడానికే

హఠాత్తుగా పింఛన్ల ఆర్భాటం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా.. రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క కొత్త పింఛన్‌ ఇచ్చిన పాపాన పోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అటు జనంతో పాటు ఇటు అధికార పార్టీ నాయకుల్లోనూ తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఎక్కడికెళ్లినా నిరుపేదలు పింఛన్ల కోసం పాలకులను నిలదీస్తున్నారు. పీజీఆర్‌ఎస్‌ అర్జీలలో గానీ, ఎమ్మెల్యేలు నిర్వహించే ప్రజా దర్బార్‌లలో గానీ అత్యధికులు పింఛన్లు ఎప్పుడిస్తారంటూ నిలదీస్తుండటంతో అధికార పార్టీ నేతలు ప్రజల్లోకి తిరగలేక మధనపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో పెరుగుతున్న తీవ్ర అసంతృప్తిని చల్లపరచటానికి హఠాత్తుగా అక్టోబరు ఒకటో తేదీ నుండి కొత్త పింఛన్లు ఇస్తున్నట్లు కూటమి ప్రభుత్వం నాటకానికి తెరలేపింది.

గడువు ముంచుకొచ్చినా

అధికారుల దగ్గర సమాచారమే లేదు!

ప్రభుత్వ ఆర్భాట ప్రకటనలతో ఎంతో మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు ఆశగా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ రకాల పింఛన్ల కోసం ఏకంగా 39,495 మంది నిరుపేదలు దరఖాస్తు చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్‌ ప్రక్రియ కూడా పూర్తయినట్లు చెబుతున్నప్పటికీ.. నిర్దేశిత గడువు ముగియగానే పింఛన్ల పోర్టల్‌ను ప్రభుత్వం మూసివేసింది. ఏమైనా వివరాలు తెలుసుకోవాలన్నా అవకాశం లేకుండా చేసింది. మరోవైపు అక్టోబరు ఒకటో తేదీ వచ్చేసినా, ఇంతవరకు కొత్త పింఛన్లపై తమకు ఎలాంటి సమాచారం గానీ, అధికారిక ఆదేశాలు గానీ అందలేదని సంబంధిత శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఒకటో తేదీన కొత్త పింఛన్ల పంపిణీ జరగడం ముమ్మాటికీ అనుమానమేనని స్పష్టమవుతోంది.

వడపోత జాతర..

స్థానిక ఎన్నికల కోసమేనా?

వచ్చిన భారీ దరఖాస్తులను మండలాల్లో ఎంపీడీఓలు, పట్టణాల్లో మున్సిపల్‌ కమిషనర్లు నిర్దాక్షిణ్యంగా వడపోత నిర్వహించినట్లు సమాచారం. బడ్జెట్‌ కోతలు, నిధుల కొరత నెపంతో సామాజిక భద్రతా పింఛన్లపై తీవ్రమైన కోత విధించేందుకు తెరవెనుక కసరత్తు జరుగుతోంది. త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు, ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ ఎన్నికలు రానుండటంతో ఓట్ల కోసం ఈ ప్రకటన చేసినట్లు ప్రచారంలో ఉంది. ఇందులోనూ కఠినమైన ‘సిక్స్‌ స్టెప్‌ వాలిడేషన్‌’ వడపోత చాలదన్నట్లు.. దీనికి అదనంగా ‘సెవెన్త్‌ స్టెప్‌ వాలిడేషన్‌’ (అంటే పచ్చ పార్టీకి చెందిన వారై ఉండాలి) అనే అలిఖిత నిబంధనను తెరపైకి తెచ్చి కేవలం తమ పార్టీ వర్గాలకే పింఛన్లు దోచిపెట్టేందుకు కూటమి పెద్దలు కట్రలు పన్నుతున్నారనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement