పెద్దతిప్పసముద్రం: మండలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. గత పది రోజులుగా ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల వరకు నమోదవుతుండటంతో జనజీవనానికి తీవ్ర విఘాతం కలుగుతోంది. ఎండల తీవ్రతకు జనం వీధుల్లోకి రావడానికే జంకుతున్నారు. మండుతున్న ఎండల కారణంగా దినసరి కూలీలు, పశుకాపరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగటిపూట పొలాల్లో పనిచేసే వారు వడదెబ్బ, డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదముందని, ప్రజలు మజ్జిగ, పుచ్చకాయలు, కొబ్బరినీళ్లు తీసుకుంటూ జాగ్రత్తలు వహించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాన కూడళ్లు, బస్ షెల్టర్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.


