వరి గడ్డికోసం ఎగబడుతున్న రైతులు
ఎండిపోతున్న వరి పంట పశువుల మేతగా..
రాయచోటి టౌన్: రాయచోటి పశుసంవర్ధక శాఖ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల్లో పశుగ్రాసం కొరతను ఆసరాగా చేసుకుని, దళారీలు శ్రీకాళహస్తి, మైదుకూరుల నుంచి గడ్డి కట్టలను తెచ్చి రూ. 270 నుంచి రూ. 300 వరకు విక్రయిస్తూ దోపిడీకి తెగబడుతున్నారు. ఈ దందాకు చెక్ పెడుతూ వీరబల్లె మండలం ఓదివీడుకు చెందిన రైతు భాస్కర్, శ్రీకాళహస్తికి చెందిన ముని అంకయ్యతో సోషల్ మీడియా ద్వారా స్నేహం పెంచుకున్నారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా శ్రీకాళహస్తి రైతుల నుంచి వరిగడ్డి లోడ్లను రాయచోటికి రప్పించారు. మార్కెట్లో రూ. 300 ఉన్న గడ్డి కట్టను ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం రూ. 200లకే అందించారు. దీంతో ట్రాక్టర్‌కు 144 కట్టల చొప్పున వచ్చిన రెండు లోడ్ల వరిగడ్డి కేవలం గంట వ్యవధిలోనే హాట్ కేక్‌లా అమ్ముడుపోయింది. అక్కడికక్కడే రైతులు నగదు చెల్లించి కొనుగోలు చేయడంతో.. ప్రతి రైతుకు రూ. 700 నుంచి రూ. 1,000 వరకు ఆదా అయింది.


