పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని షామీర్ బైకు వరల్డ్, ప్‌లైవుడ్ ఎంటర్‌ప్రైజెస్, ఎం.ఎస్ గ్లాస్ షాపుల్లో బుధవారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.48లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం రాత్రి పని ముగించుకుని మూడు షాపుల యజమానులు ఇంటికి వెళ్లారు. రాత్రి 11గంటల సమయంలో షాపులో నుంచి మంటలు వస్తుండటంతో వారు అక్కడికి వెళ్లారు. వెంటనే అక్కడున్న వారు అగ్రిమాపక కేంద్రానికి సమాచారమిచ్చారు. అగ్నిమాపకశాఖాధికారి సునీల్ కుమార్ తన సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో వెళ్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. గంటసేపు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కానీ షాపులలో ఉన్న దాదాపు 30 బైకులు, ప్‌లైవుడ్, గ్లాస్ వస్తువులు కాలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న ఆర్‌ఐ షేక్షావల్లి తన సిబ్బందితో వచ్చి స ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్‌భంగా అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతూ మొదట బైకు షాపులో మంటలు చెలరేగాయని, బైకులలో పెట్రోలు ఉండటంతో మంటలు ఎక్కువగా వ్యాపించాయన్నారు. ఆ షాపు అనుకుని ఉన్న మరో రెండు షాపులు అగ్ని ప్రమాదానికి గురయ్యాయన్నారు. షాపు యజమానులు మాత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగిందన్నారు. మళ్లీ సంఘటనా ప్రాంతానికి వెళ్లి ప్రమాదం ఎలా జరిగిందో దర్యాప్తు చేస్తామన్నారు.


