మదనపల్లె టౌన్ : కుటుంబ సభ్యుల మందలింపులు, కుటుంబ పరిస్థితులపై కలిగిన ఆవేదనతో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన అన్నమయ్య జిల్లాలోని బి.కొత్తకోట, మదనపల్లెలో చోటుచేసుకున్నాయి. పోలీసుల కథనం మేరకు.. బి.కొత్తకోటలో బుధవారం రాత్రి సుమారు 17 ఏళ్ల యువకుడిని పాడి ఆవులను మేపేందుకు వెళ్లలేదని కుటుంబ సభ్యులు మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురై విషం తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. మరో ఘటనలో మదనపల్లె పట్టణం, అమ్మచెరువు మిట్టకు చెందిన నారాయణ భార్య లక్ష్మీదేవి (57) మేకలను కుటుంబ అవసరాల కోసం యజమాని విక్రయించడంతో మనస్తాపానికి గురయ్యారు. ఇంట్లో ఉన్న పురుగుమందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


