● మదనపల్లె, పుంగనూరులో
63 కేంద్రాలు అదనంగా ఏర్పాటు
● జాబితాను ప్రచురించిన కమిషనర్లు
● అభ్యంతరాలకు నేడు ఒక్కరోజే గడువు
సాక్షి, మదనపల్లె : మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం జిల్లాలోని మదనపల్లె, పుంగనూరు మున్సిపల్ కమిషనర్లు పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రచురించారు. పాత మున్సిపల్ వార్డుల స్థానంలో కొత్త వార్డుల ఏర్పాటు కోసం పూర్తిగా వార్డుల పునర్విభజన జరిగింది. దీని ఆధారంగానూ, ఓటర్ల సంఖ్య పరంగాను లెక్కించి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల ఈ రెండు మున్సిపాలిటీలలో 63 కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
● గత మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కో పోలింగ్ కేంద్రంలో వెయ్యికి మించి ఓటర్లు ఉన్నారు. మదనపల్లెలో అయితే 2 వేల నుంచి 2,600 వరకు ఒక పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్య ఉంది. ఎన్నికల సంఘం చేపట్టిన మార్పుల నేపథ్యంలో మున్సిపల్ అధికారులు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు సంఖ్య పెంచారు. మదనపల్లె మున్సిపాలిటీలో 109 పోలింగ్ కేంద్రాలు ఉండగా, వాటి పరిధిలో 1,16,958 మంది ఓటర్లు ఉన్నారు. 48 కేంద్రాల్లో 2 వేల ఓటర్లు దాటిన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ ఓటర్లను విభజించి అదే పోలింగ్ కేంద్రం పరిధిలో కొత్తగా 43 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాంతో ఇప్పుడు పోలింగ్ కేంద్రాల సంఖ్య 144కు చేరింది.
● పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలో గత ఎన్నికల్లో 51 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 36 కేంద్రాల పరిధిలో వెయ్యికి మించిన ఓటర్లు ఉండడంతో వాటిని విభజించి కొత్తగా 20 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ 43,951 మంది ఓటర్లు ఉన్నారు. పెరిగిన పోలింగ్ కేంద్రాలతో కలిపి 71 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కొత్త పోలి కేంద్రాల ఏర్పాటు విషయంలో ఒక పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్లకు అదే పోలింగ్ కేంద్రం పరిధిలో కొత్త పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. దీనికోసం పక్కనున్న పోలింగ్ కేంద్రాల నుంచి ఓటర్లను కొత్త పోలింగ్ కేంద్రాల్లో కలపలేదు.
ఈ రెండు పెండింగ్
వార్డుల పునర్విభజనకు సంబంధించి రాయచోటి మున్సిపాలిటీ విషయంలో స్థానికులు న్యాయస్థానం ఆశ్రయించగా దీన్ని కోర్టు కొట్టి వేసింది. దీంతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఇక్కడ ప్రారంభించనుండటంతో పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రచురించలేదు. అలాగే బి.కొత్తకోట నగర పంచాయతీ ఏర్పాటుకు సంబంధించి నడుస్తున్న కేసు విచారణ ఈనెల 24న ఉంది. దానివల్ల ఇక్కడ కూడా ఎన్నికల ప్రక్రియ మొదలు కాలేదు.
అభ్యంతరాలకు ఒక్కరోజే
ఈ పోలింగ్ కేంద్రాల ప్రచురణకు సంబంధించి అభ్యంతరాలను అధికారులు స్వీకరించనున్నారు. గురువారం కేంద్రాలను ప్రచురించిన అధికారులు వాటికి సంబంధించి అభ్యంతరాలను స్వీకరించేందుకు మాత్రం శుక్రవారం ఒకరోజు మాత్రమే అవకాశం కల్పించారు. కేంద్రాలను పరిశీలించుకునేందుకు ఒక్కరోజు గడువు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. కేంద్రాల స్థానాల మార్పు లేదా జాబితాపై ఏవైనా మార్పులు, చేర్పులపై అభ్యంతరాలను, సూచనలను చేసేందుకు అవకాశం కల్పించారు. సంబంధిత వార్డుల ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు తమ వినతులు లేదా అభ్యంతరాలను మున్సిపల్ అధికారులకు తెలియజేయవచ్చు.


