‘మాకు సోది చెప్పకండి’.. | - | Sakshi
Sakshi News home page

‘మాకు సోది చెప్పకండి’..

Sep 11 2026 10:04 AM | Updated on Sep 11 2026 10:04 AM

కడప ఎస్పీపై జాతీయ ఎస్టీ కమిషన్‌ తీవ్ర ఆగ్రహం!

ఒకే కేసులో ఒక వర్గానికి స్టేషన్‌ బెయిల్‌.. ఎస్టీలపై ఏకపక్ష అరెస్టులు, రిమాండ్లు ఎందుకు?

హైదరాబాద్‌ విచారణకు ఎస్పీ ఎందుకు రాలేదు?.. డీఎస్పీ మురళీ నాయక్‌పై హుస్సేన్‌ నాయక్‌ నిప్పులు

కడప అర్బన్‌ : వైఎస్సార్‌ కడప జిల్లా కొండాపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఒక ఘర్షణ కేసులో పోలీసుల దర్యాప్తు, వివక్షపూరిత అరెస్టుల తీరుపై జాతీయ ఎస్టీ కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఏడాది జనవరి 14న జరిగిన ఘర్షణలో ఇరువర్గాల వారు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే పోలీసులు ఒక వర్గానికి చెందిన వారిపై కేవలం 41ఏ నోటీసులు జారీ చేసి పోలీస్‌ స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేయగా.. ఎస్టీ వర్గానికి చెందిన తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. వారిలో ఐదుగురిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 9వ నిందితుడైన డేరా శేఖర్‌ను ఏప్రిల్‌ 28న అక్రమంగా అరెస్టు చేశారు.

ఏపీ కమిషన్‌ నుండి ఢిల్లీ జాతీయ కమిషన్‌ దాకా బాధితుల పోరాటం

తమపై జరిగిన ఘర్షణ, పోలీసుల తీవ్ర వివక్షా పూరిత వేధింపులపై డేరా శేఖర్‌ తరఫున కుటుంబ సభ్యులు 2026 ఏప్రిల్‌ 29న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అక్కడ ఆశించిన న్యాయం జరగకపోవడంతో, శేఖర్‌ భార్య డేరా జ్యోతి ఏకంగా ఢిల్లీలోని జాతీయ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించి సమగ్ర విచారణ జరపాలని వేడుకున్నారు.

హైదరాబాద్‌లో విచారణ..

ఎస్పీ రాకపోవడంపై కమిషన్‌ ఫైర్‌

ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న జాతీయ ఎస్టీ కమిషన్‌.. సెప్టెంబర్‌ 7న హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో విచారణ చేపట్టింది. ఈ విచారణకు కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ స్వయంగా హాజరు కావాలని కమిషన్‌ ఆదేశించినప్పటికీ, పోలీస్‌ శాఖ తరఫున పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌ హాజరయ్యారు. దీనిపై జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జుటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ‘మాకు సోది చెప్పకండి.. ఎస్పీ ఎందుకు హాజరు కాలేదు? చట్టం ముందు ఎవరైనా సమానులే‘ అని నిలదీశారు.

స్థానికంగా ఒక వర్గానికే కొమ్ముకాస్తారా?

కేసు దర్యాప్తులో పోలీసుల వ్యవహారశైలిపై కమిషన్‌ సభ్యుడు ప్రశ్నలు సంధించారు. ‘ఒకే ఘటనలో ఇరువర్గాలపై సమానంగా చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? స్థానికంగా ఒక వర్గానికి మాత్రమే అనుకూలంగా వ్యవహరించారా?‘ అని నిప్పులు చెరిగారు. గాయపడిన ఎస్టీలపై కేసులు పెట్టడం, డిశ్చార్జ్‌ అయిన వెంటనే అరెస్టు చేయడం వంటి అంశాలను తీవ్రంగా పరిగణించారు. జాతీయ కమిషన్‌ విచారణ నేపథ్యంలో ఈ కేసు జిల్లాలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. కమిషన్‌ తీసుకోబోయే తదుపరి నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని బాధితులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement