పెద్దతిప్పసముద్రం : మండలంలోని పులికల్లు సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన మురళి(45) తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తి ములకలచెరువు నుంచి ద్విచక్ర వాహనంలో పులికల్లుకు వస్తుండగా ఓ లారీ కారణంగా తమ బిడ్డ గాయాల పాలయ్యాడని ఆరోపిస్తూ క్షతగాత్రుడి తల్లి కనుగొండ లక్ష్మినర్సు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాయపడిన వ్యక్తి తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎస్‌ఐ పరమేశ్ నాయక్ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐ సూచనల మేరకు మదనపల్లెలోని ఎంవీఐ శ్రీహరి గురువారం పీటీఎంకు విచ్చేసి ఈ ఘటనపై ఆరా తీసి లారీని పరిశీలించి వెళ్లినట్లు ఎస్‌ఐ తెలిపారు.
బాలిక అపహరణ..
పోక్సో కేసు
సాక్షి, చిత్తూరు : మైనర్ బాలికను అపహరించి, ఆమైపె లైంగికదాడికి పాల్పడ్డ కేసులో నరసింహులు అనే నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరుకు చెందిన 17 ఏళ్ల బాలిక పీలేరు సమీపంలో ఇంజనీరింగ్ చదువుతోంది. నిమ్మనపల్లెకు చెందిన నరసింహులు (25) అనే వ్యక్తి బాలికకు మాయ మాటలు చెప్పి, మూడు నెలల క్రితం ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో చిత్తూరు టూటౌన్ పోలీసులు తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆపై బాలికను గుర్తించి తీసుకొచ్చి, ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించి.. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి విచారిస్తున్నారు.
ప్రభుత్వాసుపత్రిలో
గుర్తుతెలియని వృద్ధుడు
కలికిరి : కలికిరి ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఓ గుర్తు తెలియని వృద్ధుడు కనిపించడంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసుల కథనం మేరకు.. సుమారు 70 ఏళ్ల వయస్సు పైబడిన వృద్ధుడు మాట్లాడలేని స్థితిలో ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఉండగా గురువారం గుర్తించిన వైద్య సిబ్బంది పోలీసులకు తెలియచేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని వృధ్ధుడిని విచారించడానికి ప్రయత్నించగా ఆయన మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. దీంతో చేసేది లేక అతనికి ఆసుపత్రిలో వైద్య సేవలందించాలని సూచించారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధుడిని ఎవరైనా ఇక్కడకు తీసుకువచ్చి వదిలేశారా.. లేదా ఇంకేమైనా కారణాలున్నాయా అని పోలీసులు విచారిస్తున్నారు. వృద్ధుని గురించి తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
హైవే పెట్రోల్ ఖాకీ వీరంగం!
రాజంపేట : పట్టణంలోని చిన్నచావిడి వీధిలో హైవే పెట్రోలు సిబ్బందిలో ఒకరు హల్‌చల్ చేసినట్లు గురువారం స్ధానికుల నుంచి ఆరోపణలు వెలువడ్డాయి. ఓ ఆటోలో ప్రయాణిస్తున్న హైవే పెట్రోలు సిబ్బంది ఎదురుగా వస్తున్న మరో ఆటోను వెనక్కి వెళ్లాలని సూచించారు. అయితే ట్రాఫిక్ ఉండటంతో వెనక్కి వెళ్లలేకపోయారు. వీలు లేని పరిస్ధితి ఉందని ఆటోడ్రైవర్ తెలిపారు. ఈనేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.. నాకే ఎదురుచెపుతావా అంటూ ఆటోడ్రైవర్ చొక్కా పట్టుకున్నారు. దురుసుగా ప్రవర్తించారు. దాడికి ప్రయత్నించినట్లు స్థానికులు ఆరోపించారు.హైవేపెట్రోలు సిబ్బంది హైవేలో ఉండాల్సిందిపోయి, నిబంధనలను అతిక్రమించారని విమర్శించారు. నడిరోడ్డులో జనం సాక్షిగా జరిగిన ఈ సంఘటనపై పలువురు హైవే పోలీసుల తీరుపై పెదవివిరస్తున్నారు. మద్యం మత్తులో ఈ గొడవ జరిగినట్లు తెలిసింది. ఆటోడ్రైవరు, హైవే పెట్రోలు ఖాకీని పట్టణ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు.


