అమానవీయం | - | Sakshi
Sakshi News home page

అమానవీయం

Sep 11 2026 10:04 AM | Updated on Sep 11 2026 10:04 AM

పసికందును బావిలో వదిలివెళ్లిన నిర్దయులు

పెద్దతిప్పసముద్రం : నిర్జన ప్రదేశం.. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఓ పసికందు ఏడుపు. లోకం పోకడ తెలియని, కళ్లు కూడా సరిగ్గా తెరవని ఆ పసి ప్రాణాన్ని ఓ బావిలో వదిలి వెళ్లిన హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నాగరికత వైపు పరుగెడుతున్న మానవత్వానికి ఇది ఒక మాయని మచ్చ. మనసును కలచి వేసిన ఈ ఉదంతం బిడ్డపై తల్లికి మమతానురాగాలు లేవా అంటూ ప్రశ్నిస్తోంది. అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలోని నవాబుకోటలో బుధవారం చోటుచేసుక్ను ఈ ఘటనకు సంబంధించి వివరాలు.. టమాటా బాక్సులో అప్పుడే పుట్టిన నవజాత శిశువును ఉంచి ఎవరో బావిలో వదిలేసి వెళ్లారని కొందరు ఎస్‌ఐ పరమేశ్‌ నాయక్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. స్పందించిన ఎస్‌ఐ సదరు శిశువును సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించాలని సూచిస్తూ అనంతరం ఈ విషయాన్ని ఐసీడీఎస్‌ అధికారులకు బుధవారమే సమాచారం అందించారు. అక్కడి స్థానికులు సదరు శిశువును బయటకు తీసి సరిహద్దు కర్ణాటక రాష్ట్రం చేలూరులోని ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం చిక్‌ బళ్లాపురం ఆసుపత్రికి తరలించారు. ఇంత వరకు ఐసీడీఎస్‌ అధికారులు ఎవరూ ఆసుపత్రికి రాలేదని ప్రజలు ఎస్‌ఐకు ఫోన్‌ ద్వారా చెప్పగా ఆయన సదరు అధికారుల నిర్లక్ష్య వైఖరిపై మండి పడుతూ మళ్లీ ఫోన్‌ చేశారు. ఎట్టకేలకు గురువారం ఉదయం 11 గంటలకు ఐసీడీఎస్‌ సిబ్బంది పోలీస్‌ స్టేషన్‌కు చేరుకోవడంతో ఎస్‌ఐ వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. విధుల పట్ల ఇంత నిర్లక్ష్యం సరికాదని హితబోధ చేశారు.తక్షణం చిక్‌ బళ్లాపూర్‌లోని ఆసుపత్రికి వెళ్లి శిశువు ఆరోగ్యంగా ఉంటే శిశు విహార్‌కు తరలించాలని అనారోగ్యంగా ఉంటే మెరుగైన వైద్యం చేయించాలని ఎస్‌ఐ చెప్పడంతో శిశు సంక్షేమ శాఖ సిబ్బంది చిక్‌బళ్లాపూర్‌ వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement