రాజంపేట టౌన్ : కొడుకు అంత్యక్రియల వేళ కన్నతల్లి గుండె పగిలి మరణించిన అత్యంత హృదయవిదారక సంఘటన వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట మండలంలోని రోళ్లమడుగు గ్రామంలో చోటు చేసుకుంది. రోళ్లమడుగు పంచాయతీ మాజీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు బుర్రు నాగేశ్వరరావు (65) గురువారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందగా, ఆ పుత్రశోకాన్ని దిగమింగుకోలేక ఆయన తల్లి బుర్రు వెంకట సుబ్బమ్మ (86) కొన్ని గంటల వ్యవధిలోనే ప్రాణాలు విడిచారు.నాగేశ్వరరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఉదయం ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు రాజంపేట పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. నాగేశ్వరరావు మృతదేహాన్ని రోళ్లమడుగులోని నివాసానికి తీసుకువచ్చినప్పటి నుంచి, 86 ఏళ్ల వృద్ధురాలైన తల్లి వెంకట సుబ్బమ్మ కన్నబిడ్డ శవాన్ని చూసి భోరున విలపిస్తూనే ఉంది. అంత్యక్రియల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసి, మృతదేహాన్ని కాటికి పంపేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆ తల్లి రోదనలు వర్ణనాతీతంగా మారాయి. కొడుకు పాడె వద్ద వెక్కివెక్కి ఏడుస్తూ ఆమె ఒక్కసారిగా మృతదేహంపైనే కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, ఆమెను కారులో రాజంపేట ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, మార్గమధ్యంలో ఎదురైన 108 వాహన సిబ్బంది వెంకట సుబ్బమ్మను పరీక్షించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. కొన్ని గంటల వ్యవధిలోనే తల్లి, కొడుకు ఇద్దరూ మృత్యువాత పడటంతో రోళ్లమడుగు పంచాయతీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే ఇంట్లో పక్కపక్కనే ఉన్న రెండు శవాలను చూసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. కన్నబిడ్డను ఒంటరిగా పంపడం ఇష్టం లేకే ఆ తల్లి కూడా కొడుకుతో పాటే వెళ్లిపోయిందంటూ అంత్యక్రియలకు వచ్చిన వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఆకేపాటి అనీల్‌కుమార్‌రెడ్డి నాగేశ్వరరావు మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు.


