మదనపల్లె టౌన్ : న్యాయం కోసం వెళ్లిన ఓ దివ్యాంగురాలు చివరకు మోసానికి బలై కన్నీరు మున్నీరవుతున్న ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో వెలుగుచూసింది. ‘‘హ్యూమన్ రైట్స్’’పేరుతో ప్రజలకు న్యాయం చేస్తానంటూ తిరుగుతున్న మహిళ తన వద్ద రూ.8 లక్షలు కాజేసిందని మదనపల్లె బసినికొండకు చెందిన దివ్యాంగురాలు జ్యోతి ఆరోపించింది. బుధవారం మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో జ్యోతి మాట్లాడుతూ కురబలకోట మండలం, అంగళ్లుకు చెందిన వాణి హ్యూమన్ రైట్స్ ప్రతినిధినని నమ్మించి, తన కేసును పరిష్కరిస్తానని చెప్పి విడతల వారీగా రూ.8 లక్షలు తీసుకుందని ఆరోపించింది. నమ్మకంతో ఇచ్చిన డబ్బును తిరిగి అడిగితే ఇవ్వకపోగా, తనపైనే తప్పుడు ఆరోపణలు చేస్తూ బెదిరింపులకు దిగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. దివ్యాంగురాలినైన తనకు ఈ డబ్బు జీవిత పొదుపు అని, ఇప్పుడు ఆర్థికంగా కుంగిపోయానని జ్యోతి కన్నీటి పర్యంతమైంది. ‘‘నాకు డబ్బు కంటే న్యాయం ముఖ్యం. నా లాంటి అమాయకులను ఇంకెవరినీ వాణి మోసం చేయకుండా పోలీసులు ఆమైపె చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి’’అని వేడుకుంది. తాను పలుమార్లు పోలీసులను, ఇతర అధికారులను ఆశ్రయించినా ఇప్పటివరకు న్యాయం జరగలేదని బాధితురాలు తెలిపింది. తన వద్ద ఉన్న ఆధారాలు, డబ్బు లావాదేవీలకు సంబంధించిన అన్ని పత్రాలు, ఇతర వివరాలను పోలీసులకు అందజేస్తానని పేర్కొంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని కోరింది. బాధితురాలి ఆరోపణలు నిజమైతే, హ్యూమన్ రైట్స్ సంస్థ వంటి గౌరవప్రదమైన పేరును అడ్డంగా పెట్టుకుని అమాయకులను మోసం చేసే వారిపై చట్టం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
దివ్యాంగురాలి ఆరోపణ


