మదనపల్లె టౌన్ : మదనపల్లె మండలం కాట్లాటపల్లి గ్రామ సమీపంలో గురువారం భూ వివాదం కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల కథనం ప్రకారం, రెడ్డీస్ కాలనీకి చెందిన వెంకట్రామిరెడ్డి భార్య ప్రభావతి, శివనగర్ ప్రాంతానికి చెందిన కృష్ణారెడ్డి భార్య రాజేశ్వరిపై ప్రత్యర్థి వర్గం దాడి చేసి వారి మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్లారని ఆరోపించారు. ఘర్షణలో విశ్వనాథరెడ్డి అనే వ్యక్తి కుడిచేతి వేలు తెగిపోయింది. ప్రభావతి, రాజేశ్వరి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. తమ తల్లి గంగులమ్మ పేరిట కాట్లాటపల్లిలో 1.75 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, ఆ భూమిని విశ్వనాథరెడ్డి వర్గీయులు ఆక్రమించు కునేందుకు యత్నించారని, అడ్డుకోవడంతోనే తమపై దాడికి పాల్పడ్డారని ప్రభావతి, రాజేశ్వరి ఆరోపించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
స్కూటర్ ఢీ..వృద్ధురాలికి..
మదనపల్లె టౌన్ : మదనపల్లె పట్టణంలో రీడింగ్ రూమ్ వీధిలో గురువారం వేగంగా వచ్చిన స్కూటర్ ఢీకొని వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఘటనపై వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామసముద్రం మండలం, చెంబకూరుకు చెందిన మునెమ్మ (60)దుస్తులు కొనేందుకు మదనపల్లె పట్టణానికి వచ్చారు. రీడింగ్ రూము వీధిలో దుకాణానికి వెళుతుండగా సైలెన్సర్ తొలగించి వచ్చిన ఓ రేసింగ్ స్కూటర్ మునెమ్మను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆమెకు కాలు విరిగి తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు బాధితురాలిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.


