● బతుకు భారంగా అనిపించినా..చావు పరిష్కారం కాదు
● సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి
● బలవన్మరణాలు.. బాఽధిత కుటుంబాలకు కన్నీళ్లు
● నేడు ఆత్మహత్యల నివారణ దినం
ఒక్క మాటకు అలిగారు.. ఒక్క మార్కులో పరీక్ష తప్పారు... ఒక్క సమస్యను తట్టుకోలేక పోయారు. ఒక్క క్షణం ఆవేశపడ్డారు..! అంతే.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.
వారి మరణంతో సమస్య తీరిందా.. కాదు వారి కుటుంబ సభ్యులకు జీవితానికి సరిపడా
శిక్ష పడింది.. తల్లిదండ్రులకు బిడ్డల జ్ఞాపకాలు.. పిల్లలకు అమ్మానాన్నల జ్ఞాపకాలు..
జీవిత భాగస్వాములకు తీరని ఒంటరితనం.. బంధువులకు మరచిపోలేని విషాదం..
‘ఆత్మహత్య’తో మిగిలేదిదే. ఒక్క నిర్ణయంతో చీకట్లోకి జారకముందే..
ధైర్యంగా నిలిచి వెలుగై నిలవాలి. ఏదైనా బతికి సాధించాలి.
కుటుంబ కలహాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో ప్రొద్దుటూరు పరిధిలో కొన్ని నెలల క్రితం జరిగిన ఓ ఘటన అద్దం పడుతోంది. కుటుంబ సభ్యులు మందలించారనే కారణంతో ఓ మహిళ మనస్తాపానికి గురైంది. ఆ క్షణంలో తీసుకున్న తీవ్ర నిర్ణయం ఆమె కుటుంబాన్నే విషాదంలోకి నెట్టింది.తన ముగ్గురు పిల్లలకు విషపదార్థం కలిపిన కూల్‌డ్రింక్‌ను ఇచ్చి, తాను కూడా అదే కూల్‌డ్రింక్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి ఇచ్చిందనే నమ్మకంతో పిల్లలు దానిని తీసుకున్నారు. కొద్ది రోజుల వ్యవధిలోనే ఆస్పత్రిలో కోలుకోలేక తల్లి, ముగ్గురు పిల్లలు మృతి చెందారు. ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. ఓ కుటుంబం మొత్తం ఈ లోకంలో ఉండేది. ఒక చిన్న కుటుంబ కలహం నాలుగు ప్రాణాలను బలితీసుకుంది. ఆ కుటుంబానికి సంబంధించిన వారిని జీవితాంతం వెంటాడే విషాదాన్ని మిగిల్చింది.


