నందలూరు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో రోజైన గురువారం స్వామివారు భక్తులకు అద్భుత దర్శనమిచ్చారు. ఉదయం ఆలయ అర్చకులు, ఆగమ పండితుల ఆధ్వర్యంలో పల్లకీసేవ, స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత సౌమ్యనాథ స్వామి మత్స్యావతారంలో పల్లకీపై మాడవీధుల్లో విహరించారు. రాత్రి సరస్వతి దేవి అలంకారంలో హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాయకర్పూరాలు సమర్పించారు.
నేటి ఉత్సవాలు:
బ్రహ్మోత్సవాలలో నాల్గో రోజైన శుక్రవారం ఉదయం పల్లకీసేవ, గ్రామోత్సవం, తిరుమంజనం ఉంటాయని ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్ తెలిపారు. రాత్రికి స్వామివారు సింహ వాహనంపై కొలువై మాడవీధుల్లో ఊరేగనున్నట్లు పేర్కొన్నారు.


