మదనపల్లె మార్కెట్‌లో టమాట ధరలు (కిలో)
తేది అధికం తక్కువ టన్నులు
జూన్15 రూ.23 రూ.10 1,340
జూన్16 రూ.20 రూ.9 1,478
జూన్17 రూ.18 రూ.9 1,451
జూన్18 రూ.16 రూ.8 1,,403
జూన్19 రూ.15 రూ.8 1,463
జూన్20 రూ.14 రూ.7 1,412
జూన్21 రూ.14 రూ.7 1,380
జూన్22 రూ.12 రూ.5 1,260
సాక్షి, మదనపల్లె: ఆకాశాన్ని తాకిన టమాటా ధరలు ఒక్కసారిగా పాతాళానికి పడిపోవడంతో అన్నదాతల ఆశలు నిలువునా అడియాశలయ్యాయి. ధరలపై ఎన్నో ఆశలతో లక్షలాది రూపాయల పెట్టుబడికి వెనకడుగు వేయకుండా జిల్లా రైతులు అత్యధిక విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేశారు. అయితే దేశంలోనే అతిపెద్ద టమాటా మార్కెట్‌గా పేరుగాంచిన మదనపల్లెలో ఊహించని విధంగా ధరలు పడిపోవడం రైతాంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. కిలో టమాటా ధర ఏకంగా ఐదు రూపాయలకే పడిపోవడంతో.. పెట్టిన పెట్టుబడి దేవుడెరుగు, కనీసం కోత ఖర్చులు, కూలీలు, మార్కెట్‌కు తెచ్చే రవాణా చార్జీలు కూడా తిరిగి దక్కే పరిస్థితి లేదని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా దాదాపు 7,548 ఎకరాల భారీ విస్తీర్ణంలో టమాటా పంట సాగులో ఉంది. ఈ సాగులో అత్యధిక విస్తీర్ణం మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాలదే.
మార్కెట్ మాయాజాలం!
సాధారణంగా వ్యాపారుల మధ్య పోటీ వల్ల ఇక్కడ ధరలు కొంతమేర ఆశాజనకంగానే ఉంటాయి. కానీ, ప్రస్తుతం ధరలు ఒక్కసారిగా ఎందుకు పతనమయ్యాయో ఎవరికీ అర్థం కావడం లేదు. మార్కెట్‌లో చూపించే అత్యధిక ధర అనేది కేవలం కొన్ని బాక్సుల ఉత్తమ రకం టమాటాలకే వర్తిస్తుంది. మిగతా సాధారణ రైతుల పంట మొత్తానికి అతి తక్కువ ధరలే కడుతున్నారు. చిత్రమేమిటంటే, దిగుబడి అత్యధికంగా వచ్చినప్పుడు కూడా ఇంత తక్కువ ధర పలకలేదు. కానీ ఇప్పుడు మార్కెట్‌కు దిగుబడి తగ్గినప్పటికీ, రేట్లు పడిపోతుండటం వ్యాపారుల సిండికేట్ దందాను స్పష్టం చేస్తోంది. మదనపల్లె మార్కెట్‌లో గత వారం రోజులుగా ధరల పతనాన్ని పరిశీలిస్తే.. ఈ నెల 19వ తేదీన ఒక్కసారిగా కిలో ధర రూ.8 లకే పడిపోయింది. ఆ తర్వాత రోజుల్లో రూ.7 పలకగా, బుధవారం నాటికి ఊహించని విధంగా ఏకంగా రూ.5 లకే పడిపోయింది.
మార్కెటింగ్ శాఖ ఏం చేస్తోంది?..
టమాటా ధరలు పతనమవుతుంటే తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన కనీస బాధ్యత మార్కెటింగ్ అధికారులపై ఉంది. గతంలో పుంగనూరు, పలమనేరు మార్కెట్లలో ఇలా ధరలు పతనమైనప్పుడు ప్రభుత్వం తక్షణమే స్పందించి తానే నేరుగా కొనుగోలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంది. అయితే మదనపల్లెలో ఇంత దారుణంగా ధరలు పతనమవుతున్నా మార్కెటింగ్ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. శ్రమపడి పంటను తీసి, మార్కెట్‌కు తరలించి ఇబ్బందులు పడే కంటే.. పొలాల్లోనే పంటను వదిలేయడం మంచిదని చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికే సగం పంట పూర్తయిన రైతులు పంటను కోయకుండా గాలికొదిలేస్తుండగా.. ఇప్పుడిప్పుడే దిగుబడి మొదలైన కొత్త పంటలు పెట్టిన రైతులు మాత్రం ఆశ చంపుకోలేక టమాటాను మార్కెట్‌కు తరలిస్తున్నారు.
మార్కెట్లలో పతనమైన ధరలు కిలో రూ.5లకే కొనుగోలు ఖర్చులు రాక పంటను వదిలేస్తున్న రైతులు
ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని డిమాండ్


