రాయచోటి: రాయచోటి మున్సిపాలిటీలో అవినీతి మొక్కలు వృక్షాలై తాండవిస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని ఏ విభాగంలోకి వెళ్లి తొంగి చూసినా అవినీతి కంపుకొడుతోంది.ప్రస్తుతం పాలకవర్గం లేకపోవడంతో, అధికార పార్టీ నేతల అండ చూసు కుని కార్యాలయ పరిధిలోని కొంతమంది అధికారు లు, సిబ్బంది దీన్ని ఒక వరంలా మార్చుకున్నారు.
స్థాయికి మించి జోక్యం..
కార్యాలయంలో పనిచేస్తున్న సచివాలయ స్థాయి ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది తాము చేసే ఉద్యోగం కంటే వివిధ విభాగాల విధినిర్వహణలలో తమ స్థాయికి మించి జోక్యం చేసుకుంటున్నారు. ఉన్నతాధికారులను సైతం రాజకీయ నేతల పేర్లు చెప్పి భయపెడుతూ తమకు నచ్చినట్లు పనులు చేయించుకుంటూ, తప్పుడు బిల్లులు పాస్ చేయించుకుంటున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలో 104 వాహనాల విక్రయం, నిరుపయోగంగా ఉన్న వాహనాల అమ్మకం, శానిటేషన్ సామగ్రి కొనుగోలు, వాహనాలకు డీజి ల్, అద్దె ట్రాక్టర్ల బాడుగ చెల్లింపులు, ఫాగింగ్.. ఇలా అన్నిట్లోనూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
అనుమతులు దేవుడెరుగు.. నిధుల స్వాహా!
ఏదైనా అభివృద్ధి పనులను చేపట్టాలంటే ముందుగా ప్రతిపాదనలను సిద్ధం చేసి పాలనా అనుమతులు లేదా ఉన్నతాధికారుల అనుమతులు పొందాల్సి ఉంటుంది. కానీ రాయచోటి మున్సిపల్ పరిధిలో ఎవరి అనుమతులు లేకపోయినా అక్కడ పనిచేస్తున్న ఒకరిద్దరు అధికారులు తమకు ఇష్టం వచ్చిన రీతిలో అధికార పార్టీ నేతల పేర్లు చెప్పుకొని అభివృద్ధి పేరుతో లక్షల రూపాయల నిధులను కా జేస్తున్నారన్న విమర్శలు కార్యాలయంలో బహిరంగంగానే వినపడుతున్నాయి. రాయచోటి పట్టణ పరిధిలోని రాయచోటి–కడప, రాయచోటి–సుండు పల్లె మార్గాలలోని డివైడర్స్‌లో చేపడుతున్న ప్లాంటేషన్, సర్కిల్స్‌లోని ఫౌంటెయిన్ల పనులే దీనికి నిదర్శనం.
దుమ్ము, ధూళిలోనే మొక్కలు.. 30 శాతమే ఖర్చు!
సాధారణంగా ప్లాంటేషన్ నిర్మాణం చేపట్టాలంటే డివైడర్ మధ్యన ఉన్న మట్టిని ఒక అడుగు లోతు వరకు తొలగించి ఎర్రమట్టి (గ్రావెల్)తో ఫిల్లింగ్ చేయాలి. కానీ కాంట్రాక్టర్ మాత్రం డివైడర్లో ఉన్న దుమ్ము ధూళి మట్టిని కొంతమేర బయటకు తీసి, అదే మట్టిలో గాడి తీసి తెచ్చిన మొక్కలను నాటేశారు. మొక్కలు నాటిన తర్వాత అయినా ఎర్రమట్టిని వేయకుండానే, బయటకు తీసిన పాత మట్టినే తిరిగి నింపి నీటిని పడుతుండటం విశేషం. ఇలా చేయడం వల్ల మొక్కలకు సరైన బలం అందదని నిపుణులు చెబుతున్నారు. నామమాత్రంగా చేపట్టిన ఈ పనులకు 20 నుంచి 30 శాతం కంటే ఖర్చు కాదని, కానీ అధికార పార్టీ అండతో బిల్లు మాత్రం పూర్తి స్థాయిలో వంద శాతం రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
రూ.10 లక్షలతో అనుమతులు లేకుండా ప్లాంటేషన్
నిబంధనలకు విరుద్దంగా బిల్లులు
అధికార పార్టీ నేతల పేర్లు చెప్పికింది స్థాయి సిబ్బంది హల్‌చల్
నిబంధనల ప్రకారం లేకుంటే చర్యలు!
రూ.10 లక్షలతో పట్టణంలో ప్లాంటేషన్, ఫౌంటెయిన్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. వీటికి ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు లేవు. మొక్కలు నాటక ముందే అడుగులోతు మట్టిని తొలగించి ఆ భాగాన్ని ఎర్రమట్టితో నింపాలని సూచించాము. మొక్కలు నాటిన తర్వాత తిరిగి ఎర్రమట్టిని వేసి నీటిని బాగా పట్టాలని కాంట్రాక్టర్‌కు చెప్పాము. త్వరలోనే చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా లేకపోతే తగు చర్యలు తీసుకుంటాం.
– మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు,
రాయచోటి


