● కుక్క కాటుతో బెంబేలెత్తుతున్న ప్రజలు ● ఆసుపత్రులకు పరుగులు తీస్తున్న బాధితులు ● పట్టించుకోని అధికారులు
భయం.. భయం..
లక్కిరెడ్డిపల్లి: కుక్కలు బాబోయ్.. కుక్కలంటూ లక్కిరెడ్డిపల్లి పట్టణ వాసులతోపాటు గ్రామీణ ప్రాంత ప్రజలు భయంతో వణుకుతున్నారు. కుక్కకాటు బాధితులు వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రిల వైపు పరుగులు పెడుతున్నారు. రెండు రోజుల క్రితం పలువురిపై పిచ్చి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాడి ఆవులపై దాడి చేయడంతోపాటు గొర్రెలు, మేకలు కోళ్లను సైతం వదలడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పిచ్చి కుక్కల దాడిలో గాయపడిన పలువురు లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వైద్యంకోసం వెళ్లగా ఒక్కో ఇంజక్షన్ ఐదుగురికి వేయాలని, ముగ్గురికి, ఇద్దరికి ఇక్కడ రాబిస్ ఇంజక్షన్లు వేయలేమని.. బాధితులకు ఇంజక్షన్లు వేయకుండా పంపించి వేసినట్లు వారు తెలిపారు. దీంతో చేసేదేమీలేక రాయచోటి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి వేలరూపాయలు ఖర్చుపెట్టుకొని కుక్కకాటు ఇంజక్షన్లు వేయించుకున్నామంటూ తెలియజేశారు.
● ఎటునుంచి వస్తాయో...
లక్కిరెడ్డిపల్లె టౌన్ పరిధిలోని గద్దగుండ్లరాచపల్లి, బాలయోగి గురుకుల పాఠశాల ఏరియా, బస్టాండ్, దర్గా, మిస్సా చర్చి, పాతకోర్టు ప్రాంతాలలో రోడ్డుపై ఉన్న వ్యక్తులనే కాకుండా ద్విచక్ర వాహనాలలో వెళ్తున్న వారిని సైతం వదలకుండా కుక్కలు మీదపడి గాయపరుస్తున్నాయని పట్టణ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. రోడ్లపై తిరగాలంటే కుక్కల బెడదతో ప్రజలు పరుగులు పెడుతున్నారు.
● పట్టించుకోని కార్యదర్శులు...
పంచాయతీ కార్యాలయంకు వెళ్లి కుక్కల విషయం సిబ్బందితోపాటు పంచాయతీ కార్యదర్శులకు తెలియజేసినా పట్టించుకోకుండా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
● ఈ మధ్యకాలంలోనే ఒకేరోజులో లక్కిరెడ్డిపల్లికి చెందిన వెంకటేశ్వర్లు, యోగీశ్వరీ, అన్వర్ బాష, మౌలానా భీ, రామచంద్ర, శివ, బాబ్జీ, బాబు, రజాక్, జాబిర్ బాష, శ్రీనివాసులు, వెంకటరమణ, మస్తాన్ వల్లి, అబ్దుల్ అలంలను కుక్కలు గాయపరిచాయి.
పాడి ఆవులపై దాడులు ..
మాకు జెర్సీ ఆవులు ఉన్నాయి. మేము పాడిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. మేతకోసం పాడి ఆవులను పంట పొలాలపై వదిలి ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కుక్కల మంద దాడి చేస్తున్నాయి. లేగ దూడలు కుక్కల కాట్లకు గురై మృత్యువాత పడుతున్నాయి. గ్రామ పంచాయతీ అధికారులు చొరవచూపి కుక్కల దాడులు నుండి రక్షించాలి.
– రేపన ప్రతాప్, పాడి రైతు, చాగల గుట్టపల్లి, లక్కిరెడ్డిపల్లి మండలం
కుక్కల బెడద నివారిస్తాం..
లక్కిరెడ్డిపల్లి టౌన్ పరిధిలో కుక్కల బెడద ఈ మధ్యకాలంలో అధికంగానే ఉంది. పిచ్చికుక్కలను ఏరివేత కార్యక్రమం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. చాలా మంది కుక్కల బారిన పడి కుక్కకాటుకు గురవుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. పై అధికారులు చొరవతో త్వరలోనే పిచ్చి కుక్కల ఏరివేత కార్యక్రమం చేపడుతాం.
– సుబ్బారెడ్డి, పంచాయతీ కార్యదర్శి, లక్కిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ
●
ఆసుపత్రికి వెళ్తే సూదులు వేయలేదు..
పిచ్చికుక్క దాడిలో గాయపడి వె వెంటనే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్తే కుక్క సూదులు వేయలేదు. కుక్క కాటుకు మందు ఐదు మందికి పైబడి వేయాలని, మీకు ఒకరి కీ, ఇద్దరి కోసం మందు ఓపెన్ చేస్తే మిగతాది మేము ఎవరికి వేయాలంటూ వైద్యులు అసహనం వ్యక్తం చేశారు. మేము చేసేదేమీ లేక రాయ చోటి ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకొని సూదు లు వేయించుకున్నాం.
– రమణ, గద్దగుండ్లరాచపల్లి
●


