పెద్దమండ్యం: విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ అన్నారు. మండలంలోని కలిచెర్ల జిల్లా పరిషత్ తెలుగు ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్–టీచర్స్ 4.0 మీటింగ్ జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యను అభ్యసించే ఏడు సంవత్సరాల్లో కష్టపడి చదివితే 70 సంవత్సరాలు సుఖంగా ఉండవచ్చని అన్నారు. 13 నుంచి 16 సంవత్సరాల వయస్సులో సోషల్‌మీడియా ప్రభావం, తప్పుడు స్నేహాలు, మాదక ద్రవ్యాలు, చెడు అలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. ఈ కీలక సంవత్సరాలను విద్యార్థులు వృథాచేస్తే భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పాఠశాలలో పిల్లల హాజరును తల్లిదండ్రులు క్రమం తప్పకుండా పరిశీలించాలన్నారు. పాఠశాల అభివృద్ధికి దాతలు, గ్రామ ప్రజలు అందిస్తున్న సహకారం అభినందనీయమని అన్నారు. గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల అభివృద్ధిలో భాగస్వామ్యులైన మాజీ ఎమ్యెల్యే కలిచెర్ల ప్రభాకరరెడ్డి కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు. మండలంలోని కేజీబీవీ, కలిచెర్ల ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల కోసం తాగునీటి బోర్లు వేశామని మోటార్లు మంజూరు చేయాలని ఎంపీపీ పూర్ణచంద్రిక కలెక్టర్‌ను కోరారు. రెండు బోర్లకు మోటార్లు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. తల్లికి వందనం రాలేదని ఓ విద్యార్థి, తల్లితో కలిసి కలెక్టర్‌కు విన్నవించు కోవడానికి రాగా ప్రాసెస్‌లో ఉందని అధికారులు వారిని నిలిపేశారు. పెద్దమండ్యం ఉన్నత పాఠశాలలో ప్రహరీగోడ నిర్మాణం పనులు ఆగిపొవడంపై ‘సాక్షి’లో శుక్రవారం వెలువడిన వార్త కథనంపై ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రహరీగోడ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకొవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జాతీయస్థాయిలో జరిగే పోటీలకు ఎంపికై న పెద్దమండ్యం ఉన్నత పాఠశాలకు చెందిన సి హర్షవర్దన్ అనే విద్యార్థిని కలెక్టర్ ఆభినందించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు కలెక్టెర్ వడ్డించారు. స్థలదాత, మాజీ సింగిల్ విండో ఛైర్మన్ కడప సుధాహరరెడ్డి, హెచ్‌ఎం మీనానాగలక్ష్మి, ఎస్‌ఎంసి ఛైర్మన్ ఎం గిరిజాపతి, వైస్ ఛైర్మన్ స్వర్ణ, తహశీల్దార్ తేజస్వి, ఎంపీడీవో శ్రీధర్‌రావు, ఎంఈవోలు మనోహర, రామక్రిష్ణ, మాజీ సర్పంచ్‌లు జింకా విశ్వనాధ, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్


