సరైన వసతులు లేవు..
అధికారులు స్పందించాలి
మరుగుదొడ్లు నిర్మించాలి
కడప అగ్రికల్చర్: నెలల తరబడి వేలకు వేలు ఖర్చు చేసి కంటికి రెప్పలా పంటలను కాపాడుకుని మంచి దిగుబడులు సాధిస్తే వాటిని మద్దతు ధరకు అమ్ముకునేందుకు మార్కెట్ యార్డుకు తెచ్చుకుంటే ఇక్కడ సరైన వసతులు లేక రైతులు అవస్థలు పడాల్సి వస్తోంది. రాయలసీమలోనే ఏకై క పసుపు యార్డు కడప వ్యవసాయ మార్కెట్‌లో ఉంది. ఇక్కడికి కడపజిల్లా నలు మూలల నుంచే కాకుండా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి కూడా రైతులు పసుపు, వేరుశనగ కాయలు తెచ్చి అమ్ముకుంటారు. అయితే మార్కెట్‌యార్డులో సరైన మౌలిక వసతులు లేక రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మార్కెట్‌యార్డులోని షెడ్లతోపాటు ఆరుబయట ఉత్పత్తులను రాసులు పోసుకుని అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో ఉన్నట్లుండి అకాల వర్షాలు పడితే దిగుబడులు వర్షార్పణం అయితే నష్టపోవాల్సి వస్తుందని రైతుల ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
మరుగుదొడ్లు లేక..
మార్కెట్‌యార్డుకు సీజన్‌లో పసుపు, వేరుశనగ దిగుబడులను అమ్ముకునేందుకు రైతులు అధిక సంఖ్యలో వస్తారు. వీరితోపాటు మార్కెట్‌యార్డులో వ్యాపారులు, హమాలీలు, మహిళా కూలీలు ఇలా చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ వసతులు సరిగా లేవు. ఒక్క మరుగుదొడ్డి లేక అవస్థలు పడాల్సి వస్తోంది. అలాగే మంచినీటికి సంబంధించి ఒకే ఆర్వో ప్లాంట్ ఉంది. అంతమంది ఉన్న మార్కెట్‌యార్డులో ఒక్క ఆర్వో ప్లాంట్ ఉంటే ఎలా పరిపోతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటు మార్కెట్‌యార్డుకు వచ్చే రైతులు విశ్రాంతి తీసుకునేందుకు గతంలో భవనాన్ని ఏర్పాటు చేశారు. అది శిథిలావస్థకు చేరుకుంది. దీంతో దీనిని ఎవరూ వినియోగిండం లేదు. మార్కెట్‌యార్డుకు వచ్చే రైతులు చెట్ల కింద, భవనాల పంచన బస్తాలపైన విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
రూ. 38 కోట్ల వ్యాపార లావాదేవీలు...
ఈ ఏడాది ఫిబ్రవరి 6 నుంచి కడప మార్డులో పసుపు కొనుగోలు ప్రారంభించారు. మొదట్లో క్వింటా పసుపు ఫింగర్, బల్ప్ ధర రూ. 13500 ధర పలికింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా క్వింటా రూ. 11 వేల నుంచి రూ. 11500 వరకు ధర పడిపోయింది. ప్రస్తుతం పసుపు ఽనాణ్యతను బట్టి దర పెరిగి ఫింగర్ కనిష్ట ధర క్వింటాల్ రూ. 11196 నుంచి గరిష్ట ధర రూ. 13,262 పలుకుతోంది. అలాగే బల్ప్ రకం కనిష్ట ధర క్వింటాల్ 8800 నుంచి గరిష్ట ధర 12388 వరకు పలుకుతోంది. అయితే మార్కెట్ యార్డు ప్రారంభం నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు వైఎస్సార్‌జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి రైతులు తీసుకొచ్చిన పసుపుకు సంబంధించి 38,307 క్వింటాళ్ల విక్రయాలు జరిగాయి. దాదాపు 38 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరిగాయి. దీంతో కడప మార్కెట్‌యార్డుకు సెస్ రూపంలో 38 లక్షలు రూపాయలు వచ్చింది. కానీ మౌలిక వసతులు మాత్రం కరువయ్యాయి. తమ గురించి పట్టించునే వారే కరువయ్యారని పలువురు రైతులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
పలుమార్లు జెడ్పీ సమావేశంలో...
కడప పసుపుమార్డులోని మౌలిక వసతుల గురించి జిల్లా పరిషత్తు కో ఆప్షన్ సభ్యులు అచ్చుకట్ల కరీముల్లా పలుమార్లు జెడ్పీ సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా సమస్య పరిష్కారం కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన సమావేశంలో కూడా సంబంధిత సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని అచ్చుకట్ల కరీముల్లా చెప్పారు.
కడప మార్కెట్ యార్డ్‌లో
వసతులు కరువు
సేద తీరాలంటే చెట్లు, పసుపు బస్తాలే గతి
ఆగిపోయిన జంబో షెడ్ నిర్మాణం
ఆరు బయటే పసుపు, వేరుశనగ విక్రయాలు
కడప మార్కెట్‌యార్డుకు 2021లో రూ. 84 లక్షలతో జంబో షెడ్డు మంజూరు చేసింది. దీనిని కాంట్రాక్టర్ కొంత నిర్మాణం చేపట్టి తర్వాత పనులు చేయకుండా వదిలేశారు.ఫలితంగా కడప మార్కెట్‌యార్డుకు రైతులు పసుపు, వేరుశన కాయలను అమ్మకాల కోసం తీసుకుని వస్తే ఆరుబయట, రోడ్లుపై పోసి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అన్నదాతలు అందోళన చెందుతున్నారు.
కడప పసుపుమార్కెట్ యార్డులో రైతులకు సరైన మౌలిక వసతులు లేవు. కొద్దిసేపు సేద తీరుదామంటే నిలువ నీడలేదు. ఎండసెగకు సంచులపైనే కూర్చోవాల్సి వస్తుంది. అధికారులు స్పందించి వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి.
– సుదర్శన్, రైతు, చిట్వేల్
మార్కెట్‌యార్డుకు పసుపు తీనుకుని వచ్చాను. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామంటే సరైన వసతి లేదు. దీంతో బస్తాలౖపైనే పడుకోవాల్సి వస్తోంది. అధికారులు స్పందించి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి. కల్పించాలి.
– క్రిష్ణయ్య, చింతమరాసుపల్లె, ఒంటిమిట్ట మండలం,
మార్కెట్‌యార్డులో మరుగుదొడ్లు లేవు. దీంతో పసుపు, వేరుశనగ కాయలను తీసుకొచ్చే రైతులు మలమూత్ర విసర్జనకు ఇబ్బంది పడాల్సి వస్తోంది.వెంటనే మరుగుదొడ్లు నిర్మించాలి. అధికారులు స్పందించి మార్కెట్ యార్డులో వసతులు కల్పించాలి.
– మునిస్వామి, రైతు


