నేడు డయల్‌ యువర్‌ సీఎండీ | - | Sakshi
Sakshi News home page

నేడు డయల్‌ యువర్‌ సీఎండీ

Apr 13 2026 7:32 AM | Updated on Apr 13 2026 7:32 AM

మదనపల్లె: జిల్లాలోని విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు డయల్‌ యువర్‌ సీఎండీ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్‌ నిర్వహించనున్నట్లు సీఎండీ పేర్కొన్నారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి విద్యుత్‌ వినియోగదారులు 8977716661కు ఫోన్‌చేసి సమస్యలను తెలిపితే పరిష్కరిస్తామని తెలిపారు.

మదనపల్లెలో

జిల్లా కేంద్రం మదనపల్లెలో డయల్‌ యువర్‌ ఏపీఎస్పీడీసీఎల్‌ సర్కిల్‌ స్థాయిలో సోమవారం ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఎస్‌ఈ సోమశేఖర్‌రెడ్డి తెలిపారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్‌ సమస్యలను 9440817449 నంబర్‌కు తెలియజేసి పరిష్కారం పొందాలని కోరారు.

జిల్లా జూనియర్‌ బాలికల హాకీ జట్టు ఎంపిక

మదనపల్లె సిటీ : పట్టణంలోని బీటీ కాలేజీ హాకీ గ్రౌండ్‌లో ఆదివారం అన్నమయ్య జిల్లా జూనియర్‌ బాలికల హాకీ జట్టు సెలక్షన్‌ ట్రయల్స్‌ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 32 మంది క్రీడాకారిణులు పాల్గొన్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్‌ కార్యదర్శి శివప్రసాద్‌ తెలిపారు.ఈ సెలక్షన్‌ ట్రయల్స్‌లో ప్రతిభ కనబరిచిన 18 మందిని ఎంపిక చేసి,ఏప్రిల్‌ 16 నుంచి 18 వరకు చిత్తూరులో జరిగే రాష్ట్రస్థాయి హాకీ పోటీలలో అన్నమయ్య జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు. జిల్లా జాయింట్‌ సెక్రటరీ జలజ, ట్రెజరర్‌ ప్రసాద్‌ రెడ్డి, జనరల్‌ సెక్రటరీ బి.శివప్రసాద్‌, డీఎస్డీఓ చంద్ర శేఖర్‌ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహించారు. కార్యక్రమంలో నేషనల్‌ అంపైర్లు పవన్‌,దిలీప్‌,సీనియర్‌ హాకీ క్రీడాకారులు,వ్యాయామ విద్యా సహాయకులు నరేష్‌ బాబు,గౌస్‌ తదితరులు పాల్గొన్నారు.

మదనపల్లె ఆర్‌ఓకు

అరెస్ట్‌ వారెంట్‌

సాక్షి, అమరావతి: అన్నమయ్యజిల్లా బి.కొత్తకోట మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేసి ప్రస్తుతం మదనపల్లె మున్సిపల్‌ రెవెన్యూ ఆఫీసర్‌ (ఆర్‌ఓ) జీవి.పల్లవి అరెస్ట్‌కు హైకోర్టు ఈనెల 2న ఉత్తర్వు జారీ చేసింది. ఆమెను అరెస్ట్‌ చేసి ఈనెల 30న న్యాయస్థానం ముందు హజరుపర్చాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. మున్సిపాలిటీలో ఒక వ్యక్తి ప్లాన్‌ అప్రూవల్‌ లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టారని, అక్రమంగా జరుగుతున్న ఈ పనిని కమిషనర్‌ అడ్డుకోలేదని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చూపారని పేర్కొంటూ రెడ్డెప్ప అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు నడుస్తుండగా విచారణ కోసం పల్లవిని ఆన్‌లైన్‌లో హజరుకావాలని తెలియజేసినప్పటికి హజరుకాలేదని కోర్టు దృష్టికి వచ్చింది. దీన్ని కోర్టు ధిక్కారంగా భావిస్తూ ఆమెకు బెయిలబుల్‌ వారంట్‌ను జారీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈనెల 30 జరిగే తదుపరి విచారణ రోజు ఆమె కోర్టు ఎదుట హజరుకావాలని ఆదేశించింది. ఈ వారెంట్‌ను అమలు చేయాలని జిల్లా ఎస్పీకి కోర్టు ఆదేశాలను పంపారు. ఒకవేళ అరెస్ట్‌చేస్తే రూ.10వేల బాండు, ఇద్దరి పూచికత్తుపై బెయిల్‌ ఇవ్వాలని న్యాయస్థానం సూచించింది. అలాగే ఈనెల 30న జరిగే కేసు వాయిదాకు హజరవుతానని, ఆ తర్వాత కూడా కోర్టు ఆదేశించే వరకు హజరువుతానని ఆమె ప్రమాణపత్రం ఇవ్వాలని ఆదేశాల్లో న్యాయస్థానం పేర్కొంది.

వెలుగు అక్రమాలపై విచారణ

బి.కొత్తకోట: స్థానిక వెలుగు కార్యాలయంలో జరిగిన అక్రమాలపై విచారణ లోతుగా జరుగుతున్నట్టు తెలిసింది. ఏడాదిన్నర కాలంగా ఇక్కడ నెలకొన్న పరిస్థితులు, ఫర్నిచర్‌ మాయం కావడం, మంజూరు చేసిన రుణాలు రికవరీ కాకపోవడం, సీ్త్రనిధి రుణాలకు సంబంధించి కొన్ని గ్రామాల నుంచి నిధులు రికవరీ కాకపోవడం, ఓ గ్రామంలో రుణాలు ఇచ్చినా పైసా వసూలు చేయకపోవడంపై డీఆర్‌డీఏ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. రుణాల రికవరీ సంబంధించి ఇప్పటికే విచారణలో అధికారులు నివేదికలో సిద్ధం చేసినట్లు తెలిసింది. ఆ నివేదికలపై ఇప్పటిదాకా చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏమిటి అన్న కోణంలో విచారణ చేస్తున్నట్టు తెలిసింది. ప్రధానంగా కార్యాలయంలోని కుర్చీలు, ఫర్నిచర్‌ మాయం కావడానికి ఏపీఎంను బాధ్యుని చేసి రూ.54 వేలు రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు. కోటావూరు డెయిరీ పేరుతో ఖర్చు చేసిన నిధుల వివరాలు, బి.కొత్తకోట డెయిరీకి సంబంధించిన నిధుల వ్యయంపైనా విచారణ జరగనున్నట్టు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక లావాదేవిలకు సంబంధించి అక్రమాలు జరిగి ఉండే అవకాశం ఉందని దానిపై లోతుగా విచారించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement