ఖాజీపేట : మండలంలోని అగ్రహారం గ్రామంలో రామకీర్తన దారుణ హత్యపై ఆదివారం ప్రజా సంఘాల నాయకులు నిజనిర్ధారణ నిర్వహించారు. కీర్తన హత్యకేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం బాలిక తల్లిదండ్రులు, బంధువులు, చుట్టపక్కల వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ కీర్తన ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఇంట్లోకి వెళ్లి దాడి చేసి గొంతు కోసి చంపాడని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారన్నారు. ఏడాది ముందు నిందితుడు కీర్తనను ప్రేమించమని బలవంతం చేశాడు. బాలిక తండ్రి, సోదరులు వెంకటేష్‌ను హెచ్చరించారన్నారు. వెంకటేష్, ప్రవీణ్‌కుమార్ తమ్ముడు తనపై దాడి చేశారని కీర్తన చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. ఇద్దరిపై ఫిర్యాదు చేస్తే కేవలం వెంకటేష్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారన్నారు. మృతురాలి ఇంటి దగ్గర కెనరా బ్యాంక్ సీసీ టీవీ పుటేజీని కొందరి ఒత్తిడి మేరకు తొలగించారన్నారు. నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించాడని, ఇద్దరు పోలీసులపై రాళ్లతో దాడి చేశాడని, అతన్ని ఆపడానికి జరిపిన కాల్పులలో కాలికి బుల్లెట్ గాయమైందని పోలీసులు తెలిపారన్నారు. కానీ పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు ఎలా దాడి చేయగలిగాడని ప్రశ్నించారు. వైద్యులు ఇచ్చిన నివేదికలో ఫ్రాక్చర్ అనే మాట వినిపిస్తోందని, బుల్లెట్ లభ్యమైనట్లు తెలియలేదన్నారు. కీర్తన అంత్యక్రియలు జరిగిన కొన్ని గంటలకే నిందితుడి తల్లి మీడియాతో తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారన్నారు., కీర్తన, వెంకటేష్‌ల ప్రేమ వ్యవహారం తనకు తెలియదని, ఘటన జరిగిన రోజు తన కుమారుడు ఇంటికి వచ్చి ప్రేమ విషయంలో కీర్తన తనను మోసం చేసిందని తెలిపాడన్నారు. ఈ విషయం అడగడానికి వెళితే కత్తితో గొంతు కోసుకుంటానని బెదిరించిందని, పెనుగులాటలో గొంతు కోసుకుందని చెప్పాడని ఆమె తెలిపారు. దీనిని బట్టి నిందితుడిని రక్షించే ప్రయత్నం ప్రారంభమైనట్లు తెలుస్తోందని ప్రజాసంఘాల నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండాలని, వారికి అవసరమైన సహాయ సహకరాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్, ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్, చైతన్య మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పద్మ, కమిటీ సభ్యురాలు అనిత, జేవీవీ సమత అధ్యక్షురాలు అరుణ, రాయలసీమ మహిళా శక్తి కార్యదర్శి వడ్ల లక్ష్మీదేవి, సీపీఎం మండల ఇన్‌చార్జి రాజశేఖర్, సాగర్, వెంకీ తదితరులు పాల్గొన్నారు.
నిజనిర్ధారణ కమిటీ సభ్యులు


