మదనపల్లె రూరల్: సంప్రదాయ కళలను ప్రోత్సహించి, వృత్తి కళాకారుల ఆదాయాన్ని పెంచడమే పీఎం విశ్వకర్మ పథకం ప్రధాన ఉద్దేశమని జిల్లా రెవెన్యూ అధికారి, ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టర్ మధుసూదన్ పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫీస్ (విశాఖపట్నం) ఆధ్వర్యంలో.. జిల్లా పరిశ్రమల కేంద్రం, డీఆర్‌డీఏ, మెప్మా సహకారంతో మదనపల్లెలో ఏర్పాటు చేసిన ‘పీఎం విశ్వకర్మ ట్రేడ్ ఫెయిర్ కమ్ ఎగ్జిబిషన్’ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. పట్టణంలోని శివాజీనగర్ పద్మావతి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో వివిధ స్టాళ్లను డీఆర్వో సందర్శించి, కళాకారుల హస్తకళా ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా సంప్రదాయ వృత్తుల వారికి ఆర్థిక, సాంకేతిక సహాయం అందుతుందని తెలిపారు. ఇటువంటి ఎగ్జిబిషన్ల నిర్వహణ వల్ల కళాకారుల ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ అవకాశాలు లభించి, వారి జీవనోపాధి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శన మార్చి 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఎంఎస్‌ఎంఈ జేడీ ఆర్.సంజయ్‌కుమార్, ఏపీఎంఎస్‌ఎంఈ డీసీ మురళీమోహన్, మెప్మా పీడీ లక్ష్మీదేవి, డీఆర్‌డీఏ పీడీ నాగేశ్వరరావు, ఎల్‌డీఎం జి.ఆంజనేయులు, టౌన్‌బ్యాంక్ చైర్మన్ ఎన్.విద్యాసాగర్, జ్ఞానాంబిక విద్యాసంస్థల అధినేత డాక్టర్ రాటకొండ గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మదనపల్లెలో మూడు రోజుల ట్రేడ్ ఫెయిర్ ప్రారంభించిన డీఆర్వో


