పీలేరురూరల్: పీలేరు హంద్రీనీవా యూనిట్–2 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా ఎం.వి.ఎస్. నారాయణరెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈ పోస్టులో ఆర్డీఓ ఎ. శ్రీనివాస్ ఇన్ఛార్జిగా కొనసాగుతూ వచ్చారు. కడప తహసీల్దార్‌గా పనిచేస్తున్న నారాయణరెడ్డి, పదోన్నతిపై పీలేరుకు బదిలీ అయ్యారు. ఎస్డీసీ బాధ్యతలతో పాటు పీలేరు అసెంబ్లీ నియోజకవర్గ (163) ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌గా కూడా ఆయన అదనపు బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన నారాయణరెడ్డికి స్థానిక తహశీల్దార్ శివకుమార్ పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు.
వాల్మీకిపురం: ఉపాధిహామీలో అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని డ్వామా పీడీ వెంకటరత్నం అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద సామాజిక బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 1225 పనులకు రూ.7.83 కోట్లు ఖర్చు చేసి వాటిపై నివేదికలో వివరించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా రూ.29,477 రికవరీకి ఆదేశించి, సిబ్బందికి రూ.37వేలు జరిమానా విధించినట్లు తెలిపారు.


