రాయచోటి : బాల్య వివాహాల నివారణతోనే మహిళా సాధికారత సాధ్యమని జిల్లా బాల పరిరక్షణ అధికారి వినోద్ అన్నారు. శుక్రవారం డైట్ కళాశాల ఆవరణలో మహిళా సాధికారత, బాల్య వివాహాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత సామాజాభివృద్ధికి అత్యంత ముఖ్యమైన అంశమని అన్నారు. మహిళలు విద్య, ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబనలో ముందుకు రావడం ద్వారా కుటుంబం, సమాజం మరింత బలపడుతుందన్నారు. ప్రతి మహిళకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఇటీవల కొన్ని ప్రాంతాలలో ఇంకా బాల్య వివాహాల ఘటనలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 18 నుంచి 21 సంవత్సరాల లోపు బాలబాలికలకు వివాహం చేయడం చట్టవిరుద్ధమన్నారు. బాల్య వివాహాలు పిల్లల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు. ప్రజలు బాల్య వివాహాలను పూర్తిగా నిరోధించేందుకు సహకరించాలని ఆయన కోరారు. మహిళల సాధికారతను ప్రోత్సహిస్తూ, బాల్య వివాహాలను నిర్మూలించడం ద్వారా ఆరోగ్యకరమైన సమానత్వ సమాజాన్ని నిర్మించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఫీమా అంజుం, లాయర్ చంద్రకళ, పారామెడికల్ మనీలా, ఔట్రీచ్ వర్కర్లు, సురేష్, సోఫీ, డైట్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.


