మదనపల్లెటౌన్ : మదనపల్లెలో వృద్ధురాలిపై దంపతులు పైశాచిక దాడికి పాల్పడ్డారు. మంగళవారం మదనపల్లెలో జరిగిన సంఘటనపై బాధితురాలు ఒకటో పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. పట్టణంలోని కురవంకలో కాపురం ఉంటున్న రమణ భార్య ఎన్.భాగ్యమ్మ(60) ఉదయం నిద్దరలేచి ఇంటి ముందు నిలబడి దంతాలు తోముకుంది. అనంతరం వీధి కులాయి వద్ద నీళ్లు పట్టుకుని ముఖం కడుగుతుండగా కేకరించి ఊచింది. అదే సమయంలో అటుగా బైకులో వెళుతున్న ట్రాన్స్ కో కార్యాలయంలో పని చేసే దంపతులు ప్రకాష్, చంద్రకళలు తమను చూసి కావాలనే ఊచిందని అనుమానంతో గొడవపడ్డారు. మాటకుమాట పెరిగి ఆగ్రహంతో ఊగిపోయిన భార్యాభర్తలు వృద్ధురాలిపై కుర్చీతో దాడి చేసి తీవ్రంగా గాయపరచారు. కుటుంబీకులు గమనించి బాధితురాలిని చికిత్సల నిమిత్తం వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రహీముల్లా తెలిపారు.
నందలూరు : మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ రైల్వేగేట్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన చోటు చేసుకుంది. ప్రతి మంగళవారం పలువురు భిక్షాటన కోసం నందలూరుకు వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారిలో ఒక వ్యక్తి మద్యం తాగి మృతిచెందినట్లు సమాచారం. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా ఎటువంటి ఆనవాళ్లు దొరకలేదు. దీంతో అతనితోపాటు వచ్చిన వారి కోసం గాలించారు. మృతుడి వివరాల కోసం ప్రయత్నిస్తామని, దొరకని పక్షంలో దహన సంస్కారం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.


