ములకలచెరువు : డివైడర్‌ను ద్విచక్రవాహనం ఢీ కొనడంతో ఒక వ్యక్తి మృతిచెందిన సంఘటన సోమవారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... ములకలచెరువు ఉపాధిహామీ కార్యాలయంలో జూనియర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు విధులు ముగించుకొని తన ద్విచక్రవాహనంలో మదనపల్లెకు వెళ్తుండగా పెద్దపాళ్యం ఫ్లై ఓవర్ వద్ద డివైడర్‌ను ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలు కావడంతో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ ప్రతాప్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ హాస్పెటల్‌కు తరలించారు. మృతుడికి భార్య అములు, కుమారుడు అఖిల్, కుమార్తె పద్మావతి ఉన్నారు. ఇతని స్వస్థలం పీటీయం మండలం నిలువురాతిపల్లె.
ఏపీ జేఏసీ అన్నమయ్య జిల్లా కార్యవర్గం ఏకగ్రీవం
రాయచోటి అర్బన్ : ఏపీ జేఏసీ అన్నమయ్య జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎంపికై నట్లు ఏపీ జేఏసీ వైఎస్సార్ కడప జిల్లా చైర్మన్ కామ్రేడ్ బి.శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం రాయచోటి పట్టణ పరిధిలోని ఎన్జీవో హోం ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల నాయకులు, కమిటీ సభ్యులతో కలిసి కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందులో బాగంగా 35 మందితో కూడిన జిల్లా నూతన కమిటీ ఏర్పాటు చేశారు. ఏపీ జేఏసీ అన్నమయ్య జిల్లా కమిటీ చైర్మన్‌గా ఎం.వేణుగోపాల్ రెడ్డి, ఏపీ ఎన్జీవోస్ అసోషియేషన్ సెక్రటరీ జనరల్‌గా ఏ.శివారెడ్డి, ఎస్‌టీయూ కోశాధికారిగా నాగేశ్వర్, ఏపీ ఎన్జీవోస్ అసోషియేషన్ కో చైర్మన్‌లుగా శ్రీనివాసన్, సుబ్రమణ్యం రాజు, హరిబాబు ఎంపికయ్యారు. అలాగే వైస్ చైర్మన్‌లుగా వీఎండీ ఇలియాస్, మహదేవ, రామాంజులు, శ్రీనివాసులు, రవిశంకర్, జాబీర్, ప్రతిభా కుమారిలను ఎంపిక చేశారు. జాయింట్ సెక్రటరీలుగా డి.వెంకటేశ్వర్లు, జి.వెంకటేశ్వర్లు, మహమ్మద్ బాషా, రవీంద్ర రెడ్డి, మధుసూధన్ , లక్ష్మి నారాయణ,, పవనకుమారిలను, వివిధ ప్రభుత్వ శాఖల నుంచి 14 మందిని ఈసీ మెంబర్లుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


