ముత్యాల పందిరిలో మురిపించిన నృసింహుడు
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనృరసింహస్వామి ముత్యపు పందిరి వాహనంపై విహరించారు.
స్వామివారి బ్రహోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం ఉదయాన్నే స్వామివార్లకు తిరుచ్చి, శుద్ధి తోమాలసేవ, ఏకాంతసేవలు నిర్వహించారు. స్నపన తిరుమంజనం కావించి ఊంజల్‌సేవ జరిపారు. వాహన మండపంలో వాహనాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై కొలువుదీరి గ్రామపుర వీధుల్లో విహరించారు. అనంతరం హనుమంత వాహన సేవ జరిగింది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకొన్నాయి. తొలిసారిగా బ్రహ్మోత్సవాల్లో కేరళ వాయిద్యాలను ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలించింది. వీటితోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన భజన కళాకారుల నృత్యాలు భక్తులను ఆకట్టుకొన్నాయి.
బ్రహ్మోత్సవాల్లో నేడు
స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజైన గురువారం ఉదయం కల్పవృక్ష వాహనసేవ, సాయంత్రం సింహవాహనం సేవ జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.


