మదనపల్లెలో కొలువుదీరిన జిల్లా కార్యాలయాలు
మదనపల్లె: రాయచోటిలో ఏర్పాటైన జిల్లా కార్యాలయాలు కొత్త జిల్లా కేంద్రం మదనపల్లెలో కొలువు దీరుతున్నాయి. చేర్పులు, మార్పులతో ఏర్పడిన నూతన అన్నమయ్యజిల్లాకు మదనపల్లెను కేంద్రంగా చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాయచోటిలోని సుమారు వందకు పైగా ప్రభుత్వ కార్యాలయాలు అక్కడి నుంచి మదనపల్లెకు తరలిరావాల్సి ఉంది. ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు ఇక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని పాలన సాగించేందుకు చర్యలు చేపట్టారు. తొలిరోజు 27 ప్రభుత్వ శాఖల కార్యాలయాలు కొలువుదీరాయి. ప్రధానంగా జిల్లా ఎస్పీ కార్యాలయం రేస్ కళాశాలలో సిద్ధమవుతోంది. దీన్ని ఎస్పీ ధీరణ్, పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. ఇప్పటి కలెక్టరేట్‌లో నడిచిన సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని పుంగనూరు రోడ్డులోని డీడీఓ భవనంలోకి మార్చారు. గురువారం ఈ కార్యాలయంలో సబ్‌కలెక్టర్ చల్లా కళ్యాణి పూజలు నిర్వహించి పాలన ప్రారంభించారు. మదనపల్లెకు వచ్చిన ఎస్పీ ధీరజ్ కుటుంబ సమేతంగా స్థానిక ప్రసన్న వెంకటరమణస్వామి ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అర్చకులు ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందించారు. తొలిరోజు గురువారం మదనపల్లెలో ఏర్పాటైన జిల్లా కార్యాలయాలు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక బీటీ కళాశాలలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా పంచాయతీ అధికారి, ముఖ్య ప్రణాళిక అధికారి, ఖాజానా శాఖ, జెడ్పీ హైస్కూల్‌లో జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఏపీసీ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌లో జిల్లా ఆడిట్, మెప్మా, పౌరసరఫరాలు, భూగర్భ జలవనరులు, సమాచార, పౌర సంబంధాలశాఖ, జీడబ్ల్యూఎస్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, ఖాదీ–విలేజ్ డెవలప్‌మెంట్, దేవదాయ–ధర్మాదాయ, జిల్లా రిజిస్ట్రార్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, బెంగళూరు రోడ్డులోని పట్టుపరిశ్రమ భవనాల ప్రాంగణంలో.. వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, సూక్ష్మనీటి పారుదల, జిల్లా రీసోర్స్, సహకార, మార్క్‌ఫెడ్, పర్యాటక, పట్టు పరిశ్రమ, చేనేత జౌళి శాఖల జిల్లా కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఈ శాఖల అధికారులు ఇక్కడి నుంచి పాలన సాగించడం ప్రారంభమైంది. ఈ శాఖల అధికారులంతా కలెక్టర్‌ను కలిశారు.
కలెక్టర్‌ను ఆశీర్వదిస్తున్న వేద పండితులు కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన జేసీ, సబ్‌కలెక్టర్, డీఆర్‌ఓ, అధికారులు
సుపరిపాలన, ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలతో ప్రస్తుత ఏడాది అన్నమయ్యజిల్లా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని కలెక్టర్ నిశాంత్‌కుమార్ ఆకాంక్షించారు. గురువారం జిల్లా కేంద్రం మదనపల్లె కలెక్టరేట్ నుంచి ఆయన పాలన ప్రారంభించారు. ఛాంబర్‌లో పాలన ప్రారంభించే ముందు పూజలు నిర్వహించారు. తర్వాత వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య కలెక్టర్‌కు స్వాగతం పలికాక ఆయన ఛాంబర్‌లో ఆశీనులయ్యారు. వేద పండితుల ఆశీర్వాదం అనంతరం ఫైళ్లపై సంతకాలు చేసి పాలనాపరమైన కార్యకలాపాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని, సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. జిల్లా అభివృద్ధికి జిల్లా అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. కలెక్టరేట్‌కు చేరుకున్న జిల్లా ఎస్పీ ధీరజ్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్‌రాజేంద్ర, డీఆర్‌ఓ మధుసూదన్, సబ్‌కలెక్టర్ చల్లా కళ్యాణి, ఆర్డీఓ శ్రీనివాసులు, వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలిపారు. కాగా మదనపల్లెలో కలెక్టరేట్‌లో కలెక్టర్ బాధ్యతలు స్వీకరించడం, నూతన ఏడాది కావడంతో సందడి నెలకొంది. జిల్లాలోని అన్ని మండలాల నుంచి తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, శాఖల జిల్లా అధికారులు కలెక్టర్‌ను కలిసి సత్కరించారు. రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు కలిశారు. దాంతో కలెక్టరేట్ సందడి వాతావరణంతో కిటకిటలాడింది.
రేస్‌లో ఎస్పీ, డీడీఓలో సబ్‌కలెక్టర్
మొదటిరోజు 27 శాఖల కార్యకలాపాలు
మదనపల్లెలో కొలువుదీరిన జిల్లా కార్యాలయాలు
మదనపల్లెలో కొలువుదీరిన జిల్లా కార్యాలయాలు
మదనపల్లెలో కొలువుదీరిన జిల్లా కార్యాలయాలు


