హార్సిలీహిల్స్‌పై సంబరాలు
బి.కొత్తకోట: బి.కొత్తకోట మండలంలోని పేదల ఊటీ హార్సిలీహిల్స్‌పై ఏటా జరిగే నూతన వేడుకల సంబరాలు ఈమారు గురువారం కూడా జరుపుకొన్నారు. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాలు, కర్ణాటక, తమిళనాడుకు చెందిన పర్యాటకులు వచ్చారు. సుదూర ప్రాంతాలకు చెందిన సందర్శకులు అతిథిగృహల్లో విడిది చేశారు. సాధారణ పర్యాటకులు బండలు, వృక్షాల మధ్యలో.. వెంట తెచ్చుకొన్న భోజనాలతో కుటుంబాల సమేతంగా విందులు చేసుకొన్నారు. సాయంత్రం వరకు కొండపై చక్కర్లు కొట్టారు. నూతన వేడుకల శుభాకాంక్షలు చెప్పుకొంటూ సరదాగా సందడి చేశారు. ఇక్కడి పాత, కొత్త, అటవీ వ్యూపాయింట్ల నుంచి ప్రకృతి అందాలను తిలకించేందుకు సందర్శకులు క్యూకట్టారు. జంతు ప్రదర్శనశాల, పిల్లల పార్కుల్లో కలియదిరిగారు. ప్రకృతి అధ్యయన కేంద్రం సందర్శించి వింతలు, విశేషాలు తిలకించారు. గాలిబండపై సేదదీరి చల్లటిగాలిని ఆస్వాదించారు. గతంలో 10 వేలకు తగ్గకుండా సందర్శకులు కొండకు వచ్చి నూతన సంబరాలు జరుపుకొనేవారు. గురువారం జరిగిన నూతన వేడుకల్లో ఏ ఏటా లేనివిధంగా కేవలం మూడు వేలకు మించని సందర్శకులు రావడం అశ్చర్యానికి గురిచేస్తోంది. వాతావరణం చల్లగా ఉన్నా, రవాణా సౌకర్యం అందుబాటులో ఉన్నప్పటికి ఈ నూతన ఏడాది సంబరాలు ఆశించిన మేర జరుపుకోలేకపోయారు. మదనపల్లె, అంగళ్లు, కాండ్లమడుగు, బి.కొత్తకోట నుంచి 24 ఆర్టీసీ బస్సులను హార్సిలీహిల్స్‌కు నడిపారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కావడంతో హార్సిలీహిల్స్ వచ్చిన వారిలో వీరే అధికంగా ఉన్నారు. కాగా కొండపై సందడి తగ్గడంతో వ్యాపారాలపై ప్రభావం చూపింది.
గతంతో పోల్చితే వేలల్లో తగ్గిన సందర్శకులు
24 ఆర్టీసీ బస్సులునడిచినా ఫలితం లేదు
వనభోజనాల విందులు చేసుకున్న కుటుంబాలు
హార్సిలీహిల్స్‌పై సంబరాలు


