ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతంతో రైతులకు ఆదాయం
రాయచోటి : రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతం ద్వారా రైతులకు అధిక ఆదాయం చేకూరుతుందని, ఇందు కోసం జిల్లా మండల స్థాయిల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి రైతులు, వ్యాపారులను అనుసంధానం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం రాయచోటిలోని ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతం, మార్కెటింగ్ సదుపాయాల కల్పనపై అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతు సంఘాల వారు వ్యాపార ధోరణిలో వ్యవహరించి మార్కెట్ డిమాండ్ ఆధారిత పంటల వార్షిక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా రైతు పంట దిగుబడుల వివరాలను వ్యాపారులు, ఎగుమతిదారులకు అందుబాటులో ఉంచి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులకు నేరుగా మెరుగైన ధరలు కల్పించాలని అధికారులకు తెలియజేశారు. జిల్లాలో పేరుగాంచిన మామిడి రకమైన వీరబల్లి బేనీషాకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నందున దానిని అవకాశంగా తీసుకొని ఎక్కువ భాగం ఎగుమతి చేయాలని తెలిపారు. వర్క్‌షాప్‌లో అధికారులు, రైతులు, స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు తెలియజేసి ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించారన్నారు. చర్చించిన విషయాలను గ్రామస్థాయికి తీసుకుపోయి మరింత మంది రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ్‌రాజేంద్రన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌పీఓలను బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, కావున రైతులు సంఘటితమై అధిక సంఖ్యలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడాలని, తద్వారా తమకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించుకోవాలని తెలిపారు. రైతులు పండించిన పంటలను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అమ్మడం ద్వారా అధిక లాభాలను పొందవచ్చని తెలిపారు. జిల్లా ఉద్యాన అధికారిణి ఎస్‌ఎస్ సుభాషిణి మాట్లాడుతూ ఎఫ్‌పీఓలకు పంటకోత అనంతరం నష్టాలను తగ్గించడానికి ఉద్యాన శాఖ ద్వారా కలెక్షన్ సెంటర్లు, కోల్డ్ రూంలు, ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్‌లు, శీతల గిడ్డంగులు, సోలార్ డ్రయర్లను 35 శాతం రాయితీతో ఇవ్వనున్నట్లు చెప్పారు.ఏపీఈడీఏ మేనేజర్ కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు మానస, పీరూసాబ్‌లు మామిడిలో పాటించాల్సిన సస్యరక్షణ చర్యలు, ఉద్యాన పంటలను మేలైన యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి జి.శివనారాయణ, డీఆర్‌డీఏ పీడీఎం నాగేశ్వరరావు, ఏపీఎంఐపీ పీడీ వై.లక్ష్మీప్రసన్న తదితరులు
జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్


