విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలి
రాయచోటి టౌన్ : విద్యార్థి దశలోనే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని, ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని సమగ్ర శిక్ష జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, డాక్టర్ ఎన్ అనూరాధ పేర్కొన్నారు. శనివారం స్థానిక సాయి శుభా కళ్యాణ మండపంలో జిల్లాస్థాయి వృత్తి వికాస ప్రదర్శన జరిగింది. జిల్లాలోని 30 మండలాలకు చెందిన 200 మందికి పైగా విద్యార్థులు మండల స్థాయి విజేతలుగా ఈ కార్యక్రమానికి హాజరై తమ నమూనాలను (మోడల్స్) ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లక్ష్యసాధనకు కష్డపడాలని సూచించారు. వృత్తుల ఆధారంగా వేసిన వేషధారణ పోటీలు చూసిన ఆమె చిన్నారులను అభినందించారు. ఈ పోటీల్లో 150 మందికి పైగా తమ ప్రతిభను ప్రదర్శించారు. టీడీపీ నాయకుడు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, అనంతరం గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు,బహుమతులు అందజేశారు. కేరీర్ మోడల్స్ విభాగంలో కురబలకోట కేజీబీవీకి చెందిన దీపిక మొదటి బహుమతి, కేవీపల్లె కేజీబీవీ విద్యార్థిని ఇందు ద్వితీయ, కెసిపల్లె, రామసముద్రం జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి బాలాజీ రెడ్డి తృతీయ బహుమతి గెలుచుకున్నారు. వృత్తిపర వేఫధారణ పోటీల్లో రాయచోటి జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలకు చెందిన అప్సా మొదటి బహుమతి, కేవీపల్లె గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని తనుషా ద్వితీయ, గాలివీడు జెడ్పీహెచ్‌ఎస్ (ఉర్దూ) విద్యార్థి ఫైరోజ్ తృతీయ బహుమతి పొందారు. చిత్రలేఖనంలో తరిగొండ జెడ్పీహెచ్‌లో చదువుతున్న సీఎండీ సుఫియన్ ప్రథమ, అంగళ్లు జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని యం. మానస ద్వితీయ, బురకాయలపేట జెడ్పీహెచ్‌ఎస్‌లో చదువుతున్న ఆర్ఫా తృతీయ బహుమతి గెలుచుకున్నారు. కార్యక్రమంలో సర్వశిక్ష సెక్టోరియల్ అధికారులు కరుణాకర్, జనార్ధన్, వెంకట రామయ్య, సుమతి, యశోద, చంద్రశేఖర్, భాస్కర్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ కె. శ్రీనివాస రాజు, మహిళా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు మాధవి,శిరీష, సైన్స్ ఆఫీసర్ ఓబుల్‌రెడ్డి పాల్గొన్నారు.


