ప్రజల మనోభావాలతో ఆడుకోవడం సరికాదు
రాయచోటి అర్బన్ : అన్నమయ్య జిల్లాను లేకుండా చేసి ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పలు అంశాలు తెలియజేశారు. మధ్యాహ్నం నుంచి వస్తున్న వార్తలు చూస్తే జిల్లాలోని నియోజకవర్గాలను ఇతర జిల్లాలలో కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయనే మాట బాధాకరంగా ఉందన్నారు. 110 ఏళ్ల రాయలసీమ చరిత్రలో జిల్లా ఏర్పడిందని సంతోషం వ్యక్తం చేశామని, ఆ జల్లాను పూర్తిగా రద్దు చేసే ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం దిగ్భ్రాంతికి గురి చేస్తోందన్నారు. శతాబ్దాల చరిత్రలో ఏర్పడిన జిల్లాను గతంతో ఎప్పుడు రద్దు చేయడం జరగలేదని ఆయన గుర్తు చేశారు. కరువు కాటకాలతో వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు గత వైఎస్సార్‌సీపీ హయాంలో ఎన్నో కష్టాలు పడి జిల్లాను సాధించుకుంటే , రద్దు చేయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. గతంలో పార్లమెంట్ ప్రాతిపదికన ఏర్పడిన అన్నమయ్య జిల్లాను లేకుండా చేస్తామంటే ఎన్ని పోరాటాలకై నా సిద్ధమేనని తెలియజేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ ప్రాతిపదికన 2022 ఏప్రిల్ 4న ఏర్పడిన అన్నమయ్య జిల్లాను యథాతదంగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గడికోట శ్రీకాంత్ రెడ్డి


