ఏపీలో విస్తృతంగా సామాజిక సేవలు
రాజంపేట: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక సేవలను విస్తృతం చేస్తామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సంగరాజు బాలరాజు అన్నారు. రాజంపేట–రాయచోటి రహదారిలోని తిరుమల కన్వన్షెన్ సెంటర్‌లో రాజంపేటలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేతృత్వంలో రెండు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర వైద్య విజ్ఞాన సదస్సు ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఎంఏ ప్రధాన ఉద్దేశాలు అయిన నిరంతర వైద్య విద్యా కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఐఎంఏ శాఖల ద్వారా వైద్య శిబిరాల నిర్వహణకు ఐఎంఏ రాష్ట్ర శాఖ సహకరిస్తుందన్నారు. సదస్సులో పాల్గొన్న ప్రతినిధులకు ఏపీ మెడికల్ కౌన్సిల్ నాలుగు నిరంతరం వైద్య విద్య పాయింట్ల కేటాయించమని, ప్రతి వైద్యుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి తమ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేసుకునే సమయంలో సంవత్సరానికి 6 పాయింట్ల చొప్పున మొత్తం 30 పాయింట్లు ఉండాలని ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు తెలిపారన్నారు. సదస్సుకు దాదాపు 800 మందికి పైగా వైద్యులు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతినిధులుగా నమోదు చేసుకొని హాజరయ్యారన్నారు. వెద్యవిజ్ఞాన పరంగా రాజంపేటలో నిర్వహించిన రాష్ట్ర వైద్య విజ్ఞాన సదస్సు విజయవంతమైందన్నారు. ఐఎంఏ నేతలు డా.సుధాకర్, డా.విజయకుమార్, డా.చలమయ్య, డా.వీరయ్య, డా.సునీల్, శ్రీహరి, డా.అనిల్, ఽడా.ధనశ్రీ, డా.నవీన్, డా.మధుసూదన్‌ల సదస్సు విజయవంతం కావడానికి సహకరించారన్నారు.
ఐఎంఏ నూతన రాష్ట్ర అధ్యక్షుడు
డాక్టర్ బాలరాజు


