తప్పుడు ఆరోపణలు.. ఆపై కవ్వింపు
మదనపల్లె: మదనపల్లె సమీపంలోని ఆరోగ్యవరం వద్ద ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద ఆదివారం ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. టీడీపీ శ్రేణుల కవ్వింపు చర్యలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రికత్త చోటుచేసుకోగా భారీగా పోలీసులు మొహరించారు. మెడికల్ కళాశాలలోకి వైఎస్సార్‌సీపీ శ్రేణులు వెళ్లకుండా కట్టడి చేశారు. ఘర్షణ వాతావరణం సృష్టించి దాడులు చేసేందుకు చినబాబు వర్గీయులు సిద్ధమైనప్పటికీ వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంయమనం పాటించారు. తప్పుడు ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు.వివరాలు... టీడీపీ తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాంచినబాబు.. మదనపల్లె మెడికల్ కళాశాలకు సంబంధించి జరిగిన 26 కోట్ల బిల్లులు మంజూరైందని, అక్కడ పని రూ.3–4 కోట్ల పని కూడా జరగలేదని, రాష్ట్రంలో మెడికల్ కళాశాలల పనుల్లో ఎంత డబ్బు తినేశారని అసత్యాలతో ఆరోపించారు. మదనపల్లె మెడికల్ కశాశాల ఉద్యోగాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి కుటుంబం అమ్ముకుందని నోటికొచ్చినట్టు తప్పుడు ఆరోపణలు చేశారు. ఈ తప్పుడు ఆరోపణలపై తంబళ్లపల్లె నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. తప్పుడు ఆరోపణలతో పెద్దిరెడ్డి కుటుంబంపై నిందలు వేయడం సరికాదని చెబుతూ మెడికల్ కళాశాల పనులు జరిగాయా లేదా చూద్దాం, ఆదివారం మేమంతా అక్కడికి వస్తాం..మీరూ రండి..ఆరోపణలు నిరూపించండి అని శ్రీరాంచినబాబుకు సవాల్ చేశారు. అన్నట్టుగానే ఆదివారం పెద్దసంఖ్యలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల మెడికల్ కళాశాల వద్దకు చేరుకున్నారు.
ప్రవేశించకుండా అడ్డంకులు
తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులు మెడికల్ కళాశాల వద్దకు వెళ్తుండగా అప్పటికే ఇక్కడికి చేరుకున్న సీఐలు, ఎస్‌ఐలు, పోలీసులు అడ్డుకున్నారు. కళాశాలలోకి వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. కళాశాలవైపునకు వెళ్లే అన్ని మార్గాల్లో పోలీసులు మొహరించారు. తిరుపతివైపునకు వెళ్లే మార్గంలో తప్ప సర్వీసు రోడ్డులోకి, పాత హైవేలోకి ఎవ్వరూ రాకుండా కట్టడి చేశారు. దాంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమీపంలోని ప్లైఓవర్ వద్దకి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని కదలనివ్వకుండా అక్కడే బందోబస్తు నిర్వహించారు. దీంతో ఉద్రిక్తతకు దారితీసింది. పెద్దిరెడ్డి కుటుంబంపై ఆధారాల్లేని తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ నేత చినబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరోపణలను నిరూపించాలని మేం కళాశాల వద్దకు వస్తున్నామని ముందే చెప్పి వచ్చాం. మమ్మల్ని కళాశాల వద్దకు వెళ్లనివ్వండి అని పోలీసులను కోరినా అంగీకరించలేదు. కళాశాలకు వెళ్లే రహదారులపై పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు.
మదనపల్లె వైద్యకళాశాల వద్ద ఉద్రిక్తత
దాడులకు చినబాబు అనుచరుల కవ్వింపు చర్యలు
ఆరోపణలు నిరూపించాలని తరలివచ్చిన తంబళ్లపల్లె వైఎస్సార్‌సీపీ శ్రేణులు
కళాశాలలోకి వెళ్లనివ్వకుండాపోలీసుల అడ్డగింత
ఆరోపణలను రుజువు చేయాలని శ్రీరాం చినబాబును కోరితే ఆయన వర్గీయులు మెడికల్ కళాశాల వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు శాంతియుతంగా ఇక్కడికి వచ్చారు. ఆరోపణలపై సమాధానం చెప్పాలని, కళాశాలలో జరిగిన పనులు చూపిస్తామని చెప్పారు. అయితే దీనికి చినబాబు తన సమాధానం చెప్పకపోగా..ఆయన అనుచరులు చేసిన హడావుడితో హైవేపై వెళ్తున్న వారు హడలిపోయారు. సమీపంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు లేకపోయినా కవ్వింపు చర్యలకు పాల్బడ్డారు. కార్లు, బైక్‌లపై వెళ్తున్నవారిని పిలిచి మీరు ఎవరు అంటూ ప్రశ్నిస్తూ భయాందోళనలకు గురి చేశారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడి చేయాలన్న కుట్రతోనే కవ్వింపు చర్యలకు పాల్బడ్డారు. ఈ చర్యకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు స్పందిస్తారని, దాన్ని అవకాశంగా చేసుకుని గోడవలు సృష్టించాలని పథకం పన్నినట్టు తెలుస్తోంది. ఫ్లైఓవర్ వద్ద ఉన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులను అక్కడినుంచి వెళ్లిపోవాలని సీఐలు, ఎస్‌ఐలు ఒత్తిడి చేశారు. మూడు గంటలకుపైగా ఈ పరిస్థితి కొనసాగగా పోలీసులు కళాశాలలోకి వెళ్లనివ్వకపోవడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు శాంతియుతంగా అక్కడినుంచి వెళ్లిపోయారు.


