హెల్మెట్ ధారణ.. ప్రాణానికి రక్షణ
రాయచోటి అర్బన్ : రోజురోజుకు జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా వాహనదారుల సంఖ్య పెరిగిపోయింది. ప్రతి పనికి సీ్త్ర , పురుషులు ఎక్కువగా ద్విచక్రవాహనాలను వినియోగిస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో ద్విచక్రవాహనాలు సుమారు 5 లక్షల వరకు ఉన్నాయని అంచనా. ఇందులో హెల్మెట్ ధరించేవారి సంఖ్య ఒక లక్ష వరకు మాత్రమే ఉంటుందని అంచనా. ప్రతి నిత్యం పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పించడంతోపాటు హెల్మెట్ లేని వాహనదారులపై కేసులు నమోదు చేయడం, జరిమానా విధించడం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 2024లో హెల్మెట్ వాడని 26,044 మందిపై చలాన్లు విధింగా , ఆ సంఖ్య 2025లో ఇప్పటి వరకు 43951 కావడం గమనార్హం. అయినా వాహనదారుల్లో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతోంది. గత మూడు, నాలుగేళ్ల నుంచి చిన్న వయసు వారి నుంచి పెద్దల దాకా ద్విచక్రవాహనాల వినియోగం ఎక్కువైంది. దీంతో జిల్లా వ్యాప్తంగా నెలకు కనీసం 100కు పైగా ద్విచక్ర వాహనాల ప్రమాదాలు జరుగుతున్నాయి. కొంత వరకు చిన్నపాటి గాయాలతో బయటపడుతున్నా, ఎక్కువ గాయాలతోపాటు, తలకు గాయాలైన వారు ప్రాణాలు పోగోట్టుకుని ఆయా కుటుంబాలకు తీరని శోకసంద్రం మిగిలిస్తున్నారు.
డేంజర్ జోన్‌లో యువత
బైక్ రైడర్ల వల్ల చాలా వరకు అన్ని పట్టణాల్లో డేంజర్ బెల్ మోగుతోంది. రాయచోటి పట్టణ పరిధిలో సెలవు రోజుల్లో యువకులు ద్విచక్ర వాహనాలలో ఇష్టారాజ్యంగా రైడ్లు చేస్తూ, విన్యాసాలతో చెలరేగిపోతున్నారు. పట్టణ శివారు ప్రాంతాలలోని బైపాస్ రోడ్లలో ఇలా చాలా చేయడంపై పలు సందర్భాల్లో పోలీసులకు కూడా ఫిర్యాదులు చేసిన ఘటనలు ఉన్నాయి.
వీడని నిర్లక్ష్యం.. అవగాహన తప్పనిసరి
హెల్మెట్ ధరించడంపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా చాలా మంది మారడం లేదు. పోలీసులు చలానాలు విధిస్తారనే భయంతోనే ఎక్కువ మంది పోలీసులు కనిపించగానే హెల్మెట్ ధరిస్తూ , దాటి వెళ్లిన తరువాత తీసేస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరికొందరు బయటి ఊరికి, దూర ప్రయాణాలకు వెళ్లే సమయాల్లో మాత్రమే హెల్మెట్లు ధరిస్తున్నారు. కొందరు హెల్మెట్లు ధరిస్తున్నా స్ట్రాప్ బిగించకపోవడం చేస్తున్నారు. మరికొందరు పోలీసులు ఉంటున్న జంక్షన్లు, వాహనాల తనిఖీల వద్ద మాత్రమే హెల్మెట్ వాడుతూ.. తరువాత తీసేసి చేతులకు తగిలించుకుంటున్నారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి సమయంలో పోలీసు యంత్రాంగం మరింత ఎక్కువగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
హెల్మెట్ ధరించడం వల్ల ఉపయోగాలు
హెల్మెట్ ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాలకు గురైతే దాని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. తలకు తగిలిన గాయం తీవ్రత తగ్గడం, పుర్రె పగుళ్ల ప్రమాదం తగ్గుతుంది. ప్రమాద సమయంలో హెల్మెట్ అనేది తలకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. తద్వారా మెదడుకు గాయాలు కాకుండా సహాయ పడుతుంది. చాలా వరకు హెల్మెట్‌లు ధరించడం వల్ల గాలి, దుమ్ము, సూక్ష్మ స్థాయి చెత్త, క్రిమి కీటకాల నుంచి కళ్లను రక్షిస్తుంది. అలాగే శబ్ద కాలుష్యం నుంచి రక్షణ కలుగుతుంది.
హెల్మెట్ చేతికి తగిలించుకుని వెళ్తున్న
వాహనదారుడు
జల్లా వాండ్లపల్లె వద్ద ట్రాక్టర్ ఢీకొని మృతి చెందిన ద్విచక్ర వాహనదారుడు అజయ్ కుమార్ (ఫైల్)
ద్విచక్రవాహనదారులు హెల్మెట్ వాడటం వల్ల ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడుకోవచ్చనే విషయం అందరికీ తెలిసిందే. అయితే చాలా మందిని నిర్లక్ష్యం వెంటాడుతూనే ఉంది. కొడుకులను పోగోట్టుకుంటున్న తల్లిదండ్రుల ఆర్తనాదాలు ఊరూరా ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. కుటుంబానికి ఆ శోకం దరిచేరకుండా ఉండాలంటే హెల్మెట్ అనే రక్షణ కవచాన్ని ధరించక తప్పదు. బరువుగా ఉందనే కారణాలు చూపితే మృత్యుఒడిలోకి చేరక తప్పదు. కుటుంబ భారం మోస్తూ పెంచి పోషించే పురుషులకు హెల్మెట్ మోయడం ఒక బరువేమీ కాదు. ఇప్పటికై నా హెల్మెట్ ధరిద్దాం... కుటుంబాన్ని శోకసంద్రం వైపు వెళ్లకుండా చూసుకుందాం..
రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వాహనదారులు
కఠిన చట్టాలు ఉన్నా పట్టించుకోని వైనం
అవగాహన కల్పిస్తున్న పోలీసులు
మారితే కుటుంబానికి శోకం దూరం
హెల్మెట్ ధారణ.. ప్రాణానికి రక్షణ
హెల్మెట్ ధారణ.. ప్రాణానికి రక్షణ


