క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా ఆటకట్టు | - | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా ఆటకట్టు

Nov 22 2025 7:28 AM | Updated on Nov 22 2025 7:28 AM

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా ఆటకట్టు

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా ఆటకట్టు

బెంగళూరు కేంద్రంగా బెట్టింగ్‌

పీజీ హాస్టళ్ల ముసుగులో కార్యకలాపాలు

ఇద్దరు కీలక సభ్యులు అరెస్ట్‌

రూ.10.56 లక్షలు స్వాధీనం

డీఎస్పీ భావన వివరాలు వెల్లడి

ప్రొద్దుటూరు క్రైం : ఇతరుల బ్యాంక్‌ అకౌంట్లతో బెంగళూరు కేంద్రంగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాలోని ఇద్దరు కీలక సభ్యులను టూ టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి రూ.10.56 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ప్రొద్దుటూరు డీఎస్పీ భావన శుక్రవారం వివరాలు వెల్లడించారు. ప్రొద్దుటూరు మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన ధనికల వీరశంకర్‌, కాశినాయన మండలానికి ఆర్ల చంద్రయాదవ్‌ బంధువులు. చంద్రయాదవ్‌ 2007లో బెంగళూరుకు వెళ్లి అక్కడి ఒక హోటల్‌లో పని చేసేవాడు. తర్వాత అంచెలంచెలుగా పీజీ హాస్టళ్లను సొంతంగా నిర్వహించే స్థాయికి ఎదిగాడు. వీరశంకర్‌ కూల్‌డ్రింక్‌ షాపు, ఇతర వ్యాపారాలు చేస్తూ దివాళా తీశాడు. దీంతో అతను ఏదైనా పని చూపించాలని తన బంధువైన చంద్రయాదవ్‌ను అడగడంతో.. బెంగళూరుకు పిలిపించుకొని తన రెండు పీజీ హాస్టళ్లను లీజుకు నిర్వహించుకోవాలని అతనికి ఇచ్చాడు. కొంత కాలం తర్వాత ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహించాలనే ఆలోచన చంద్రయాదవ్‌ మనసులో కలిగింది. ఇదే విషయాన్ని వీరశంకర్‌కు చెప్పగా అతను సరేనన్నాడు. ఇందుకోసం మనకు కొన్ని ఫేక్‌ బ్యాంక్‌ కరెంట్‌ అకౌంట్లు అవసరం అవుతాయని చంద్రయాదవ్‌ చెప్పడంతో వీరశంకర్‌ ఆ దిశగా ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలోనే ప్రొద్దుటూరు మండలంలోని ఖాదర్‌బాద్‌లో ఉన్న తన బంధువు చెన్నకృష్ణను సంప్రదించాడు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ కోసం తమకు కరెంట్‌ అకౌంట్లు కావాలని చెన్నకృష్ణ తనకు పరిచయం ఉన్న వారిని నమ్మించాడు. వారి ద్వారా వివిధ బ్యాంక్‌లలో అకౌంట్లను ఓపెన్‌ చేయించాడు. ఈ విధంగా వాళ్ల బ్యాంక్‌ అకౌంట్‌ బుక్కులు తీసుకొని, ఫేక్‌ సిమ్‌ కార్డులతో నెట్‌బ్యాంకింగ్‌, ఆన్‌లైన్‌లో రాయల్‌బుక్‌ 365 కామ్‌ ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా విస్తృతంగా బెట్టింగ్‌ నిర్వహించారు.

బెట్టింగ్‌ బాగోతం వెలుగులోకి..

చాపాడు మండలంలోని చిన్నగురువలూరు గ్రామానికి చెందిన పెదమల్ల జగన్‌ అనే వ్యక్తి ద్వారా క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠా సభ్యులు వివిధ బ్యాంకుల్లో కరెంట్‌ అకౌంట్లు ఓపెన్‌ చేయించారు. ఆ అకౌంట్లు ఫ్రీజ్‌ కావడంతో మరిన్ని అకౌంట్లు కావాలని వీరశంకర్‌, చంద్రయాదవ్‌లు అడగడంతో అతను అందుకు అంగీకరించలేదు. దీంతో వారు అతనిపై దాడి చేశారు. దాడి ఘటనపై ఈ నెల 3న జగన్‌ టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫేక్‌ అకౌంట్లు, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు సంబంధించిన బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో వెబ్‌సైట్‌ లావాదేవీల కోసం ఫేక్‌ అకౌంట్లను ఓపెన్‌ చేయించిన చెన్నకృష్ణ, నరేంద్ర, మేరువ హరి, సుధీర్‌కుమార్‌రెడ్డి, కృష్ణారెడ్డి, రవితేజలను ఈ నెల 5న ప్రొద్దుటూరులో సీఐ సదాశివయ్య అరెస్ట్‌ చేశారు. అయితే అప్పట్లో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు సంబంధించి కీలక ముఠా సభ్యులు వీరశంకర్‌, చంద్రయాదవ్‌లు పోలీసులకు దొరకలేదు. అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. పక్కా సమాచారం అందుకున్న టూ టౌన్‌ సీఐ సదాశివయ్య సిబ్బందితో కలిసి శుక్రవారం వీరశంకర్‌, చంద్రయాదవ్‌లను అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.10.56 లక్షలు నగదు, 3 సెల్‌ఫోన్లు, ఒక బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు చెప్పారు. బెట్టింగ్‌ లావాదేవీలు నిర్వహించిన అనుమానాస్పద బ్యాంక్‌ అకౌంట్లను ఫ్రీజ్‌ చేయాల్సిందిగా ఆయా బ్యాంక్‌లకు తెలిపినట్లు డీఎస్పీ వివరించారు. డబ్బు ఆశ చూపి బ్యాంక్‌ అకౌంట్లు ఓపెన్‌ చేయిస్తామంటే యువకులు నమ్మి సమస్యల్లో చిక్కుకోరాదని డీఎస్పీ సూచించారు. ఇంకా ఈ కేసులో లోతైన విచారణ చేస్తున్నామని, బెట్టింగ్‌ ముఠాతో సంబంధాలున్న అందరినీ గుర్తించి అరెస్ట్‌ చేస్తామనితెలిపారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ చూపిన సీఐ సదాశియ్య, టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. రివార్డు కోసం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement