రాజంపేట వాసికి అరుదైన గౌరవం
రాజంపేట : రాజంపేట పట్టణంలోని సరస్వతీపురానికి చెందిన నక్కా నాగార్జునకు అరుదైన గౌరవం లభించింది. పశ్చిమ గోదావరి టూ పారిస్ అనే పేరుతో ఆయన ప్రసారం చేసిన డాక్యుమెంటరీకి పురస్కారం దక్కింది. ఈ వివరాలను ఆయన శుక్రవారం వెల్లడించారు. ముంబైలోని టాటా థియేటర్లలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖల చేతుల మీదుగా లాదిల్ మీడియా నేషనల్ అవార్డు అందుకున్న ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఒలంపిక్స్ క్రీడాకారులు వాడే కొన్ని దుస్తువులు పశ్చిమ గోదావరి జిల్లాలోని సీతారాంపురం, నరసాపురం వాసులకు ఆర్డర్ వచ్చాయి. దీంతో తెలుగు రాష్ట్రాలతోపాటు ఇండియా పేరు అక్కడ మారుమోగింది. ఆర్డర్‌తో వెస్ట్ గోదావరి వాసులకు జీవనోపాధి దక్కింది. కాగా నక్కా నాగార్జున హైదరాబాదు ఎన్‌టీవీ వనిత మీడియా చానల్‌లో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు.
భద్రకాళికి రాహుకాల పూజ
రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళి అమ్మవారికి రాహుకాల పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ఈఓ డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం అమ్మవారి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు అభిషేకాలు, పూజలు జరిపారు. అనంతరం అమ్మవారిని పూలు, పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. అలాగే నిమ్మకాయలతో హారాలతో అలంకరించి భక్తులు దర్శన ఏర్పాటు చేశారు. అనంతరం మహిళలు అమ్మవారికి నిమ్మకాయలపై ఒత్తులు వెలిగించి హారతులు పట్టారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంచిపెట్టారు.
భారీ వర్షం
– పిడుగుపాటుతో తప్పిన ప్రమాదం
ఓబులవారిపల్లె : మండల వ్యాప్తంగా శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి ఉరుములు, మెరుపులతో దట్టమైన మేఘాలు అలుముకొని భారీ వర్షం కురిసింది. శుక్రవారం చిన్నఓరంపాడు, పాములేరు వంక సమీపంలో ఉన్న పున్నాటివారిపల్లి, దళితవాడ గ్రామానికి చెందిన జి.గౌరమ్మ, ఎల్.లక్ష్మమ్మలు మేకలు మేపుకుంటూ ఉండగా సమీపంలో పిడుగు పడింది. దీంతో వీరిద్దరూ సొమ్మసిల్లి పడిపోగా గమనించిన స్థానికులు వీరిని ఆసుపత్రిలో చేర్పించారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తహసీల్దార్ యామినీ రెడ్డి మాట్లాడుతూ మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని, కావున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నప్పుడు సురక్షితమైన ప్రదేశంలో ఉండాలని సూచించారు.
జూదరుల అరెస్ట్
మదనపల్లె రూరల్ : పేకాట ఆడుతున్న 10 మంది జూదరులను అరెస్ట్ చేసినట్లు టూటౌన్ సీఐ రాజారెడ్డి తెలిపారు. పట్టణంలోని బీకే పల్లె పంచాయతీ వైఎస్సార్ కాలనీ నల్లవీర గంగమ్మ ఆలయ సమీపంలో పెద్ద ఎత్తున జూదం ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసు సిబ్బంది పేకాట స్థావరంపై శుక్రవారం దాడి చేశారు. ఈ దాడిలో సమీప ప్రాంతాలకు చెందిన 10 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.24,460, 10 మొబైల్ ఫోన్లు, 2 ద్విచక్రవాహనాలు, 1 ఆటో స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరు పరిచామని సీఐ తెలిపారు.
రాజంపేట వాసికి అరుదైన గౌరవం
రాజంపేట వాసికి అరుదైన గౌరవం


