పెళ్లయిన రెండు నెలలకే..
● నవ వధువు ఆత్మహత్య ● కుటుంబ సమస్యలతో..
మదనపల్లె రూరల్ : పెళ్లయిన రెండు నెలలకే కుటుంబ సమస్యలతో నవ వధువు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. బసినికొండ పంచాయతీ సాయిబాబా గుడి వీధికి చెందిన వెంకటరమణ, ప్రమీల దంపతుల కుమారుడు వెంకటేష్‌కు బండకాడపల్లెకు చెందిన భానుప్రకాష్, నాగేశ్వరి దంపతుల కుమార్తె లావణ్య(20)కు రెండు నెలల క్రితం వివాహం జరిగింది. వెంకటేష్ తండ్రి వెంకటరమణ మృతి చెందడంతో ప్రస్తుతం అతని తల్లి ప్రమీల భార్య లావణ్యతో కలిసి స్థానికంగా నివసిస్తున్నారు. ఎలక్ట్రీషియన్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇరు కుటుంబాల మధ్య బంధుత్వం ఉంది. అయితే లావణ్యకు వివాహనం అయినప్పటి నుంచి అత్త ప్రమీల నుంచి వేధింపులు మొదలయ్యాయి. ప్రతి చిన్న విషయంలోనూ కోడలి వైపు నుంచి తప్పులు వెతుకుతూ తిడుతూ ఉండటంతో ఇద్దరి మధ్య సయోధ్య లేకుండా పోయింది. రెండు నెలల కాలంలోనే వేధింపుల కారణంగా లావణ్య మానసిక వేదనకు గురైంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తాము ఉంటున్న ఇల్లు కాకుండా మరో ఇంటిలో లావణ్య చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో వెంకటేష్.. ప్రమీల సమీపంలో లేకపోవడంతో కొంతసేపటి తర్వాత గమనించారు. ఉరి నుంచి కిందికి దించి వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ గదికి తరలించారు. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేశారు. మృతురాలి తల్లి నాగేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుననట్లు సీఐ కళా వెంకటరమణ తెలిపారు.


